గట్స్ అంటే విశాల్ వే.. అలా కనిపించటానికి ఎంత ధైర్యం కావాలి?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 July 2020 6:35 AM GMT
గట్స్ అంటే విశాల్ వే.. అలా కనిపించటానికి ఎంత ధైర్యం కావాలి?

గ్లామర్ ప్రపంచంలో ఉన్న వారికి అందమే వారి ఆస్తి. ఏ మాత్రం తేడా వచ్చినా వారి మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపుతుందన్నట్లుగా వ్యవహరిస్తారు. సినిమాల్లో మాదిరి వెంట్రుక పక్కకు తప్పనట్లుగా.. బాహ్య ప్రపంచానికి వచ్చే సమయానికి వారెన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ తీరు గ్లామర్ ప్రపంచంలో ఉన్న వారందరూ చేస్తారు. దీనికి భిన్నమైన వారు కొందరుంటారు. అందులో మొదటివరుసలో నిలిచేది తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. తన బట్టతలను ఆయన ఎప్పుడు దాచుకోరు.

వెండితెర మీద తనదైన గ్లామర్ తో వెలిగిపోయే ఆయన.. వాస్తవ జీవితంలో ఎంత సింఫుల్ గా ఉంటారో ఆయనకు సంబంధించిన ఫోటోల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అంతేనా.. గడ్డంతో కనిపంచటానికి సైతం వెనుకాడరు. ఇప్పుడు అదే బాటలో నడుస్తూ ఆసక్తికర చర్చకు తెర తీశారు తమిళ హీరో విశాల్. ఇటీవల కరోనా సోకిన నేపథ్యంలో ఆయన వీడియోచేశారు. తన తండ్రితో పాటు పాజిటివ్ అయిన ఆయన.. వారం రోజుల్లో ఆయుర్వేదిక మెడిసిన్స్ వాడి కోలుకున్నట్లు చెప్పారు.

అయితే.. ఈ వీడియోలో ఆయన కనిపించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. మాసి పోయిన ముఖం.. గడ్డంతో కనిపించటమే కాదు.. తెల్ల వెంట్రుకలు కొట్టొచ్చినట్లుకనిపిస్తున్నాయి. చూసినంతనే అనారోగ్యానికి గురైనట్లు కనిపించేలా ఉన్న ఆయన ధైర్యానికి హేట్సాప్ చెప్పాల్సిందే. గ్లామర్ ప్రపంచంలో ఉన్న వారంతా బొమ్మల్లా తయారై మాత్రమే ప్రజల ముందుకు రావటంలో అర్థం లేదన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పేశారు.

టాలీవుడ్ లోని అగ్ర హీరోలు మొదలు.. ఓ మోస్తరు నటులంతా కూడా తమ ఒరిజినల్ అందాల్ని దాచేసుకొని.. బయటకు ఎలా కనిపిస్తారో తెలిసిందే. తాను మిగిలిన వారికి భిన్నమన్న విషయాన్ని తాజా వీడియోతో చెప్పేశారు. కరోనా వేళ ఎలాంటి పరిస్థితి ఉందన్న విషయాన్ని చెప్పే క్రమంలో ఆయన్ను చూసినోళ్లంతా ముక్కున వేలేసుకునే పరిస్థితి. ఏమైనా.. ఇలాంటివి చేయాలంటే ఎంతో గుండె ధైర్యం కావాలన్నది మర్చిపోకూడదు. అది తనలో చాలానే ఉందన్న విషయాన్ని చెప్పేసిన విశాల్ కు అభినందనలు. వెండితెర మీద కనిపించేలా వాస్తవ జీవితంలోనూ కనిపించాలన్న రూల్ ఏమీ లేదన్న విషయాన్ని తన చేతలతో విశాల్ తేల్చేశారని చెప్పాలి. అందుకు ఆయనకు అభినందనలు తెలియజేయాల్సిందే.

Next Story