మాటలు లేకుండా.. 'మర్డర్'‌ ట్రైలర్‌.. వైరల్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 July 2020 5:01 AM GMT
మాటలు లేకుండా.. మర్డర్‌ ట్రైలర్‌.. వైరల్‌

నిత్యం వివాదాలతో సావాసం చేసే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. కరోనా సమయంలో సినిమాలు తీయడం ఆయనకే చెల్లింది. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం మర్డర్‌. మంగళవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు. అన్ని భాషల్లో ఒకే సారి ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ చిత్ర ట్రైలర్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక ప్రేమ కథ, రెండు కుటుంబాలను ఎలా చిన్నాభిన్నం చేసిందనేది ఈ చిత్రంలో చూపించనున్నారు.ఈ చిత్ర ట్రైలర్‌లో విశేషం ఏంటంటే.. మాటలు లేకుండానే కేవలం బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తోనే ఈ ట్రైలర్ కొనసాగుతోంది. పిల్లలను ప్రేమించడం తప్పా? తప్పు చేస్తే దండించడం తప్పా? వేరే గతి లేనప్పుడు చంపించడం తప్పా? పిల్లలను కనగలం గాని వాళ్ల మనస్తత్వాలన కనగలమా? సమాధానం మీరే చెప్పండి అనే టైటిల్స్‌తో సాగిన ట్రైలర్‌ ఉత్కంఠ రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాను అని రామ్‌గోపాల్ వర్మ కొద్ది రోజుల కిందట చెప్పిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అమృత పాత్రలో ఆవంచ సాహితి, మారుతిరావు పాత్రలో శ్రీకాంత్‌ అయ్యంగార్‌ నటిస్తున్నారు.

Next Story