రాజకీయాలకు దూరంగా వైసీపీ కీలక నేత.. గుంటూరులో చర్చ.!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 May 2020 3:01 AM GMTరాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో.. ఎప్పుడు ఎలాంటి పరిణామాలు ఉంటాయో.. ఊహించడం కష్టం. నిన్న ఓ రేంజ్‌లో రాజకీయాలు చేసిన నాయకులు రేపటి పరిస్థితిలో ఏమవుతారో కూడా ఊహించడం కష్టమే! ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.. గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్. ఏడాది కిందట.. ఆయన రేంజ్ వేరు.. ఇప్పు డు ఫుల్ డిఫరెంట్. ఏడాది కిందట.. ఆయన ఇంటి చుట్టు.. వైసీపీ కి చెందిన అభిమానులు, తన అనుచరులు, పార్టీ ప్రముఖుల నుంచి వచ్చే ఫోన్లు.. క్షణం తీరిక లేకుండా ఉన్న నాయకుడు ఆయన.
కానీ, ఇప్పుడు ఆయనను పట్టించుకునే వారు కానీ, ఆయన గడప తొక్కేవారు కానీ.. ఆయన గురించి మాట్లాడేవారు కానీ ఎవరూ ఒక్కరు కూడా కనిపించడం లేదంటే విస్మయం వ్యక్తం అవుతుంది. ఏడాది కిందట జరిగిన ఎన్నికల్లో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన మర్రి రాజశేఖర్.. అనూహ్య పరిస్థితిలో సీటు త్యాగం చేశారు. బీసీ వర్గానికి చెందిన విడదల రజనీకి ఆయన తన టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే, ఈ క్రమంలో జగన్ మర్రికి ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్సీని చేసి, మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. కానీ, ఇవ్వలేదు. ఇక, ఇప్పటికే శాసన మండలిని రద్దు చేయాలని ఒక తీర్మానం చేసిన నేపథ్యంలో ఇది అమలు జరిగి...మండలి రద్దయితే.. మంత్రి పదవి దక్కే ఛాన్స్ కూడా లేదు.
ఇదిలావుంటే, నియోజకవర్గంలో అయినా.. మర్రి రాజశేఖర్ హవా ఏమన్నా దూకుడుగా ఉందా? అంటే.. పేట నుంచి గెలిచిన రజనీ దూకుడు ఎక్కువగా ఉండడం, సీనియర్లను పట్టించుకోకపోవడం సహా.. మేనేజ్ చేసేశారు. ఈ క్రమంలోనే మర్రి వర్గాన్ని కూడా రకరకాల ప్రలోబాలు.. ఇతరత్రా ఆశలతో ఆమె మేనేజ్ చేశారని, అంతా తానే చూసుకుంటానని అధిష్టానం దగ్గర కూడా ఆమె చెప్పేసినట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఎవరైనా ఏదైనా సమస్యపై ముందు మర్రిని సంప్రదిస్తే.. అలాంటి వారి సమస్యను పట్టించుకోకుండా పక్కన పెడుతున్నారని విడదల విషయంపై చర్చ సాగుతోంది.
ఈ మొత్తం పర్యవసానంతో.. మర్రిరాజశేఖర్‌ను పట్టించుకునే నాయకులు తగ్గిపోయారట. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రజనీ మర్రిని పక్కన పెట్టి పూర్తిగా తమ వర్గానికే టిక్కెట్లు ఇచ్చుకున్నారను. అటు అధిష్టానం కూడా ఇప్పట్లో మర్రి లాంటి నాయకులను పట్టించుకునే పరిస్థితి లేదు. దీంతో ఆయన కూడా సైలెంట్ అయ్యారని ప్రచారంసాగుతోంది. మరి ఈ పరిస్థితి ఎన్నాళ్లు ఉంటుందో చూడాలి.