అదే జరిగితే.. ఆసీస్ రావడం కంటే.. ఇండియా వెళ్లడం సులభం
By న్యూస్‌మీటర్ తెలుగు
ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ కరోనా కారణంగా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆసీస్ మాజీ కెప్టెన్, క్రికెట్ ఆస్ట్రేలియా డైరెక్టర్ మార్క్ టేలర్ అన్నారు. అయితే.. టీ20 వరల్డ్‌కప్ వాయిదా పడితే మాత్రం.. ఇండియన్ క్రికెట్ టీ20 లీగ్.. ఐపీఎల్ నిర్వహణకు మార్గం సుగమమవుతుందని టేలర్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతమున్న పరిస్థితులలో టీ20 వరల్డ్ కప్ కోసం 15 జట్లు ఆస్ట్రేలియా రావడం కష్టమని టేలర్ అన్నారు. లాక్‌డౌన్ కారణంగా ఇంకా 14 రోజులు ఐసోలేషన్ నిబంధన టోర్నీ నిర్వహణకు ఆటంకం కలిగిస్తుందని.. కాబట్టి టోర్నీని వాయిదా వేయాలని ఐసీసీ భావించవచ్చన్నారు. ఇదే జరిగితే.. టీ20 టోర్నీ కోసం జట్లుగా ఆస్ట్రేలియా రావడం కంటే.. ఒక ఆటగాడు ఐపీఎల్ కోసం వెళ్లడం ఈజీ అని అన్నారు. ఒకవేళ ఐపీఎల్ జరిగితే.. సదరు క్రికెటర్ భారత్‌కు వెళ్లే విషయం అతని నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఈ ఆసీస్ మాజీ క్రికెటర్ అబిప్రాయం వ్యక్తం చేశాడు.
ఇదిలావుంటే.. కరోనా వైరస్ విస్తృతి కారణంగా.. ఈ ఏడాది అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌పై సందేహాలు నెలకొన్న నేఫథ్యంలో టేలర్ వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. ఇక మార్క్ టేలర్ 104 టెస్టులాడి 19 సెంచరీలు, 40 అర్థ సెంచరీల సాయంలో 7525 పరుగులు చేయగా.. అందులో ఓ త్రి శతకం(334 నాటౌట్) కూడా ఉంది. 113 వన్డేలు ఆడిన టేలర్ ఒక సెంచరీ 28 అర్థ సెంచరీల సాయంతో.. 3514 పరుగులు చేశాడు.