దారుణం: ఇద్దరు కూతుళ్లను దారుణంగా హత్య చేసిన తండ్రి
By సుభాష్ Published on 25 May 2020 7:30 PM IST
దేశంలో దారుణాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. కట్టుకున్న భార్యలను, కన్న కూతుళ్లను, కొడుకులను ఇలా మద్యం మత్తులో కన్నవారినే కడతెరుస్తున్నారు. మద్యానికి బానిసలుగా మారి మృగాళ్లుగా తయారవుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మద్యం మత్తులో మానవ మృగాడిగా మారిన ఓ తండ్రి కన్న కూతుళ్లను అతి కిరాతకంగా హతమార్చాడు. రాష్ట్రంలోని సంత్‌కబీర్ నగర్ జిల్లా బెల్హెర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తాగుడుకు బానిసైన జనాబ్ (40) అనే వ్యక్తి తన ఇద్దరు మైనర్ బాలికలను బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైనాబ్ రోజురోజుకు తాగుడుకు బానిస కావడంతో భార్య విడాకులు ఇచ్చి వెళ్లిపోయింది. దీంతో కూతుళ్లు అల్లుమిన్ నిషా (6), రూబీ (3)లతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆదివారం రాత్రి ఫుల్లుగా మద్యం తాగి వచ్చి ఇద్దరు చిన్నారులను బండరాయితో కొట్టి చంపేశాడు. పిల్లలు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుంటే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారులను హత్య చేయడానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు ఘటన స్థలానికి వచ్చే సరికి నిందితుడు మద్యం మత్తులో చలనం లేకుండా ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.