రూ 2.32లక్షలతో 25 టన్నుల ఉల్లి కొని సొంతూరుకు బయలుదేరాడు.. చివరికి ఏం జరిగిందంటే..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 April 2020 10:15 AM ISTలాక్‌డౌన్ కారణంగా ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. సొంత ఊరుకు వెళ్లాలంటే కూడా ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. దీంతో కొంత మంది విభిన్నమైన ఆలోచనలతో ఎలాగోలా ఇంటికి చేరాలన్న ఉద్దేశంతో రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఇంటికి చేరడం కొసం చేసిన ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటో చూద్దాం.
అలహాబాద్‌కు చెందిన ప్రేమ్ మూర్తి పాండే ముంబై ఎయిర్‌పోర్ట్‌లో పనిచేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో ఎయిర్‌పోర్ట్ మూతపడడంతో ప్రేమ్ ఇంటికి వెళ్లాలనుకున్నాడు. ముంబయిలో లాక్‌డౌన్ ఆంక్షలు కఠినంగా ఉండటంతో ప్రేమ్ కాస్తా భిన్నంగా ఆలోచించాడు. కేవలం నిత్యావసరాలకు మాత్రమే మినహాయింపు ఉందని తెలుసుకున్న ప్రేమ్.. తాను కూడా కూరగాయల వ్యాపారం పేరుతో అక్కడినుంచి వెళ్లిపోవాలని భావించాడు.
అయితే.. ముందుగా.. రూ. 10వేలకు 1300 కిలోల వాటర్‌మిలన్ కాయలు కొన్నాడు. వాటిని ఏప్రిల్ 17న మినీ ట్రక్కులో లోడ్ చేసుకొని నాసిక్ వరకు వచ్చాడు. అక్కడ లోడ్‌ను అమ్మేసి ట్రక్కును తిరిగి ముంబైకి పంపించేశాడు. అయితే.. ఏప్రిల్ 20 తర్వాత ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలు సడలిస్తుందని ప్రేమ్ అనుకున్నాడు. కానీ కేంద్రం మే 3 వరకు లాక్‌డౌన్ విధించింది. అంతేకాదు మహారాష్ట్రలో కూడా కరోనా కేసులు అధికంగా ఉండడంతో ఎవరిని వేరే రాష్ట్రాలకు అనుమతించడం లేదు.
ఇక చేసేదేం లేక వాటర్‌మిలాన్ అమ్మగా వచ్చిన డబ్బు, తన దగ్గర ఉన్న డబ్బుతో రూ. 77500కు ట్రక్‌ను అద్దెకు తీసుకున్నాడు. దాంట్లో రూ. 2.32 లక్షలతో 25 టన్నుల ఉల్లిగడ్డను లోడ్ చేసుకున్నాడు. ఏప్రిల్ 20వ తేదీన బయలుదేరి.. మొత్తం 1200 కిలోమీటర్లు ప్రయాణించి 23వ తేదీకి అలహాబాద్‌కు చేరుకున్నాడు. అయితే.. అలహాబాద్‌లో ఉల్లిగడ్డ లోడ్ అమ్మాలనుకున్న ప్రేమ్‌కు ముందేరా హోల్‌సేల్ మార్కెట్‌లో చుక్కెదురయ్యింది. ఉల్లిగడ్డను కొనేందుకు ఎవరూ ముందుకురాలేదు. దీంతో ఆ లోడ్‌తో తన సొంతూరు కొత్వా ముర్బక్‌పూర్‌కు వెళ్లిపోయాడు.
శుక్రవారం ఇంటికి చేరుకున్న ప్రేమ్ దూమ్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. వెంటనే పోలీసులు అతన్ని కరోనా పరీక్షలకు పంపగా.. రిపోర్టులో కరోనా నెగిటివ్ వచ్చింది. అయితే.. ముందు జాగ్రత్తగా అతన్ని హోం క్వారంటైన్‌కే పరిమితం కావాలని పోలీసులు ఆదేశించారు.
ఇయితే.. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి ఇళ్లు చేరావు.. ఆ ఉల్లిగడ్డ లోడ్ ఏం చేస్తావు అని ప్రేమ్‌ను ప్రశ్నించగా.. నేను కేవలం ముంబయి నుండి ఇళ్లు చేరడం మాత్రమే ఆలోచించానని.. అందుకోసం ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదని అనుకున్నాని అన్నాడు. అయితే ఉల్లిగడ్డలకు వచ్చిన కష్టమేమి లేదని.. మంచి రేటు వచ్చినప్పుడే.. అమ్ముతాను అంటూ ఏ బాధ లేకుండా చెబుతున్నాడు. ఏదేమైనా మధ్యలో ఎటువంటి ఉపద్రవం సంభవించలేదు కాబట్టి.. ఇంటికి క్షేమంగా చేరాడు. అదే మధ్యలో ఏమైనా జరిగివుంటే.. అందుకే వున్న చోట ఉండరా.. గంజి తాగి పండరా.. అన్నది.