బీఫ్ తీసుకుని వెళ్తున్నాడని సుత్తితో దాడి చేసిన వ్యక్తులు.. పోలీసులు అలా చూస్తూ ఉండిపోయారు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Aug 2020 10:57 AM GMT
బీఫ్ తీసుకుని వెళ్తున్నాడని సుత్తితో దాడి చేసిన వ్యక్తులు.. పోలీసులు అలా చూస్తూ ఉండిపోయారు..!

బీఫ్ తీసుకుని వెళుతున్నాడనే అభియోగాలపై కొందరు వ్యక్తులు ఓ వ్యక్తిని నడిరోడ్డు మీద చితకబాదారు. సుత్తి తీసుకుని ఓ వ్యక్తి బాదుతూ ఉంటే.. మరో వ్యక్తి తన్నుతూ కనిపించాడు. అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు సదరు వ్యక్తిని కాపాడాలని కూడా అనుకోలేదు.

ఈ ఘటన శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో గురుగ్రామ్ లో చోటుచేసుకుంది. గో సంరక్షణ సమితికి చెందిన సభ్యులమని చెబుతున్న కొందరు వ్యక్తులు ఓ పికప్ ట్రక్కును దాదాపు 8 కిలోమీటర్లు వెంబడించి ఆపారు. డ్రైవర్ లక్మన్ ను బయటకు లాగిన వ్యక్తులు అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అతడు గోమాంసాన్ని తీసుకుని వెళుతున్నాడనే అభియోగాలపై దాడి చేసినట్లు తెలుస్తోంది. 2015లో దాద్రీ ఘటన మరచిపోకముందే ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.

అతడిని కొడుతున్నప్పుడు పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ ఆపడానికి ప్రయత్నించలేదు. అతడి దగ్గర దొరికిన మాంసాన్ని ల్యాబ్ కు పంపించిన పోలీసులు.. డ్రైవర్ పై దాడి చేసిన వ్యక్తుల్లో ప్రదీప్ యాదవ్ ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను పరిశీలించిన పోలీసులు మరి కొంతమందిని గుర్తిస్తున్నామని తెలిపారు. లక్మన్ ను కొద్దిసేపటి తర్వాత ఆసుపత్రికి తరలించారు.

ఆ వాహనంలో తరలిస్తోంది గేదె మాంసమని వాహనం యజమాని తెలిపారు. తాను ఈ వ్యాపారంలో 50 సంవత్సరాలుగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.

Next Story
Share it