మాళవిక శర్మ.. ఓ వైపు వ్యాపార ప్రకటనల్లో నటిస్తూ, టాలీవుడ్ లో మాస్ మహారాజ సరసన ‘నేల టికెట్’ సినిమాలో నటించి మెప్పించింది. ఇప్పుడు హీరో రామ్ సరసన ‘రెడ్’ సినిమాలో నటిస్తోంది. ఓ వైపు షూటింగ్ లతో బిజీగా ఉన్న మాళవిక.. ఇటీవల హైదరాబాద్, నాంపల్లిలోని క్రిమినల్ కోర్ట్ లో కనిపించింది. ఆమె అక్కడ కనిపించడానికి కారణం ఏమిటంటే ఆమె క్రిమినల్ లాయర్ పట్టాభి దగ్గర ఇంటర్న్ గా పనిచేస్తోంది.
సాధారణంగా నటీ నటులు సినిమాలో క్యారెక్టర్లు బాగా పండడం కోసం నిజ జీవితంలో కొందరిని కలుసుకుంటూ ఉంటారు.

పోలీసు క్యారెక్టర్ చేసే నటులు కొందరు రియల్ పోలీసులను కలవడం.. క్రిమినల్ క్యారెక్టర్ చేసే సమయంలో జైల్లోకి వెళ్లి కొందరు ఖైదీలను కలవడం లాంటివి చేసే ఉంటారు. ఇక్కడ మాళవిక కూడా ఏమైనా లాయర్ గా తన రాబోయే సినిమాల్లో చేస్తోందా అని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే మాళవిక నిజజీవితంలో కూడా లాయరే. ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ ను ఫాలో అయ్యే వారికి ఆమె ‘లా స్టూడెంట్’ అని ఈజీగా అర్థమైపోతుంది. అందులో భాగంగానే ఆమె ప్రముఖ క్రిమినల్ లాయర్ వి.పట్టాభి దగ్గర ఇంటర్న్ గా చేస్తోంది.

తాను ఎల్.ఎల్.బి. ఫైనల్ ఇయర్(రిజ్వి లా కాలేజ్, ముంబై) చదువుతున్నానని, క్రిమినాలజీపై స్పెషలైజేషన్ చేస్తున్నానని మాళవిక చెప్పుకొచ్చింది. తన పాఠ్యాంశాలలో భాగంగానే ఇంటర్న్ గా చేయాల్సి వచ్చిందని.. తన పరీక్షలు ఇంకో నెలలో జరగబోతున్నాయని చెబుతోంది. గ్రాడ్యుయేషన్ అయ్యాక మాస్టర్స్ డిగ్రీ సంపాదించాలని అంటోంది.

ప్రస్తుతం ఇంటర్న్ గా వెళుతూ తాను కేసులు ఎలా వాదిస్తారో చూస్తున్నానని.. తన ఎల్ఎల్బి పరీక్షలు అయిపోయిన రెండు నెలలకు లాయర్ గా కోర్టులో అడుగు పెట్టబోతున్నానని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా కేసు వాదించడానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని అంటోంది.
ఇంతకు ముందు మాళవిక తన సినిమా షూటింగ్ అయిపోయాగానే హైదరాబాద్ నుండి ముంబైకు వెళ్లిపోయేది. కానీ ఇప్పుడు ఇంటర్న్ గా చేస్తుండడంతో హైదరాబాద్ మొత్తం చూసే అవకాశం తనకు దక్కిందని అంటోంది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్న మాళవిక చారిత్రాత్మక ప్రదేశాలైన చార్మినార్, గోల్కొండ లను చూశానని.. ఎంతో అద్భుతంగా ఉన్నాయని అంది. తన కెరీర్ ను కీలక మలుపు తిప్పిన నగరమైన హైదరాబాద్ అంటే తనకు ఎంతో ఇష్టమని అంటోంది.

హైదరాబాద్ లోనే ఇంటర్న్ షిప్ ఎందుకు తీసుకున్నానో కూడా మాళవిక క్లారిటీ ఇచ్చింది. తన అసిస్టెంట్ నుండి పట్టాభి సార్ గురించి తెలుసుకున్నానని.. అందుకే ఆయన దగ్గర 2019 నవంబర్ లో ఇంటర్న్ గా చేరానని చెబుతోంది. ప్రస్తుతం తాను హైదరాబాద్ లో ఉన్న కుటుంబసభ్యుల ఇంట్లో ఉంటున్నానని చెబుతోంది. షూటింగ్స్ లేని సమయంలో ఇంటర్న్ గా పనిచేస్తున్నానని.. తన షెడ్యూల్ గురించి పట్టాభి గారికి ముందే చెప్పానని.. ఆయన అందుకు అంగీకరించారని మాళవిక అంటోంది. ఒక్కోసారి షూటింగ్ ఎక్కువగా ఉంటోందని.. అయినా కూడా తాను తన చదువును పక్కన పెట్టేయలేనని చెపుతోంది.

తన ఇంటర్న్ షిప్ సమయంలో ‘లాజికల్ థింకింగ్’ అన్నది ఎక్కువగా డెవెలప్ చేసుకున్నానని అంటోంది మాళవిక. ఒక్కోకేసు విషయంలో ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చో అన్నది తెలుసుకుంటున్నాని తెలిపింది మాళవిక. లాయర్ ఎలాగూ అవుతున్నావు కదా.. మరి యాక్టింగ్ కూడా ఎందుకు అని మాళవికను ప్రశ్నించగా.. తనకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని.. అందుకే సినిమాల్లోకి ప్రవేశించానని చెబుతోంది. మాళవిక ‘కథక్’ కూడా నేర్చుకుంటోంది. మాళవిక రామ్ తో నటించిన రెడ్ సినిమా అతి త్వరలో విడుదల కాబోతోంది.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.