ప్రేమకు వయసుతో పని లేదంటారు కొందరు. తమ వయసులో సగం కూడా లేనటువంటి వాళ్లతో ప్రేమలో పడి వాళ్లని పెళ్లిచేసుకుంటుంటారు. బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్‌ దేవ్‌. తెలుగుతో పాటు అనేక సినిమాల్లో విలన్‌ పాత్రల్లో నటించి మెప్పించాడు. భార్య చనిపోయిన పదేళ్ల తరువాత ఇప్పుడు మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. రాహుల్‌ దేవ్‌ వయసు 51 కాగా.. ఆమె వయసు 33.

ఈ విషయం గురించి రాహుల్‌ ను ప్రశ్నించగా.. ప్రేమకు వయసుతో సంబంధం లేదు మనసులు కలిస్తే చాలునని అంటున్నాడు. నటి, మోడల్‌ ముగ్ధా గాడ్సేతో ప్రేమలో ఉన్నాడు. ఈ విషయం తన కుమారుడికి కూడా తెలుసునని చెప్పాడు. 2009లో నా భర్య క్యాన్సర్‌తో చనిపోయింది. ఆ తరువాత కొన్నాళ్ల పాటు నా కెరియర్‌తో పాటు నా కొడుకు భవిష్యత్తుపై దృష్టి సారించా. కొన్నాళ్లకు నా స్నేహితుడి పెళ్లిలో ముగ్దను కలిశా. మాది తొలి చూపు ప్రేమ కాదు. మొదట స్నేహితులయ్యాం. ఆ తరువాత ఫ్యామిలీ ఫంక్షన్‌లో కలిసే వాళ్లమని చెప్పాడు. ఈ క్రమంలో ఇష్టం పుట్టింది. మా అమ్మ మా నాన్న కంటే పదేళ్లు చిన్నది. కాబట్టి 18 ఏళ్లు పెద్ద గ్యాప్‌ కాదనిపించింది. మనం సంతోషంగా ఉంటే.. వయసు తేడా ఉండదని చెప్పుకొచ్చాడు.

Rahul Dev on relationship with Mugdha

రాహుల్‌ 1998లో తన చిన్ననాటి స్నేహితురాలు రైనాను పెళ్లిచేసుకున్నాడు. వీరికి సిద్దార్థ్‌ అనే కుమారుడు ఉన్నాడు. ఆ కుర్రాడికి 11ఏళ్ల వయసులో రైనాకు క్యాన్సర్‌ సోకింది. దీంతో రాహుల్ కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్‌ ఇచ్చాడు. క్యాన్సర్‌తో పోరాడుతూ ఆమె 2009లో కన్నుమూసింది. ఇన్నాళ్లకు ముగ్ధాతో ప్రేమలో ఉన్నాడు ఈ నటుడు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.