సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ 69 ఏళ్ల వయసులో అడవిలో సాహసాలు చేస్తున్నారు. ఈ వయసులో తాళ్లతో గుట్టలు, కొండలు ఎక్కుతున్నారు. ఇవన్ని డిస్కవరీ ఛానల్‌లో ప్రసారమయ్యే ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్’ పోగ్రాం కోసం చేశారు. బ్రిటిష్ సర్వైవలిస్ట్, టీవీ ప్రెజెంటర్ బేర్ గ్రిల్స్‌తో కలిసి రజినీకాంత్ చేసిన ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను సోమవారం విడుదల చేశారు.

ఈ ప్రోమోను బేర్ గ్రిల్స్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. రజనీకాంత్ ఎంతో సానుకూల దృక్పథంతో ఉంటారని, ఆయన ప్రతి ఛాలెంజ్‌ను గొప్పగా స్వీకరించారని అన్నారు. దీంతో ఆయనపై గౌరవం మరింత పెరిగిందని చెప్పారు. మార్చి 23న రాత్రి 8 గంటలకు ఈ ఎపిసోడ్‌ ప్రసారం కానుందని చెప్పారు.

ఈ ఎపిసోడ్ షూటింగ్‌‌ను కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో చిత్రీకరించారు. గతంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో అడవిలో ప్రయాణం చేశారు. గతేడాది ఇండియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చేసిన ఎపిసోడ్‌తో బేర్ గ్రిల్స్ కు ఇండియాలో కూడా మంచి పాపులారిటీ వచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగానే బేర్ గ్రిల్స్‌తో కలిసి ప్రధాని మోదీ జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో సాహస యాత్ర చేశారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.