ఈ పుట్టినరోజు నాడు అభిమానులకు మహేష్ బాబు రిక్వెస్ట్ ఇదే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Aug 2020 7:45 AM IST
ఈ పుట్టినరోజు నాడు అభిమానులకు మహేష్ బాబు రిక్వెస్ట్ ఇదే..!

ఆగష్టు 9.. మహేష్ బాబు అభిమానులకు పండగ రోజు. ఎందుకంటే తాము ఎంతగానో ఆరాధించే మహేష్ బాబు పుట్టినరోజు కాబట్టి..! సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా అడుగుపెట్టిన మహేష్ బాబు తన స్టామినా ఏంటో చిన్నప్పుడే నిరూపించుకున్నారు . ఇక హీరో అయ్యాక టాలీవుడ్ లో స్టార్ హీరోలలో ఒకడిగా నిలిచారు. అటు క్లాస్, ఇటు మాస్ కు నప్పే సినిమాలు చేసుకుంటూ మహేష్ బాబు దూసుకుపోతున్నారు.

ఈ ఏడాది తన పుట్టినరోజు నాడు అభిమానులకు ఓ విజ్ఞప్తిని చేశారు. అభిమానులెవరూ వేడుకలు జరుపొద్దని ఆయన కోరారు. దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోన్నందున అందరూ కరోనా నిబంధనలను పాటించాలని.. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండటం చాలా ముఖ్యమని.. అందుకే ఈ సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా సామూహిక వేడుకలు నిర్వహించొద్దని అభిమానులను కోరారు మహేష్ బాబు.

ప్రియమైన అభిమానులుకు.. మీరందరూ నాకు తోడుగా ఉండటం నా అదృష్టం. నా బర్త్ డే ప్రత్యేకంగా ఏదైనా మంచి పని చేయాలని కోరారు. అందుకు మీ అందరినీ అభినందిస్తున్నాను. ప్రస్తుతం మనతో పాటు ప్రపంచం మొత్తం కరోనా అనే మహామ్మారితో పోరాడుతున్నాము. ఈ యుద్ధంలో మనము ఓడిపోకుండా ఉండాలంటే సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేసి క్షేమంగా ఉండాలని కోరకుంటున్నాను. ప్రేమతో మీ మహేష్ బాబు అంటూ తన సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు మహేష్.

ప్రస్తుతం మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తూ ఉన్నారు. పరశురాం దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి అభిమానుల కోసం ఒక స్వీట్ సర్ ప్రైజ్ రాబోతోంది. సంగీత దర్శకుడు థమన్ తన ట్విట్టర్ ఖాతాలో మహేష్ కు సంబంధించిన ఒక ఫోటో విడుదల చేసారు. ఆ ఫొటోలో మహేశ్ బాబు ఓ మైక్ ముందున్నారు. రెడీగా ఉన్నారా..? అని అభిమానులను ప్రశ్నించాడు థమన్. చూస్తుంటే సర్కారు వారి పాట టీమ్ నుండి సాంగ్ లేదా డైలాగ్ ప్రోమో వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అభిమానులు.

Next Story