ఆ 'లెజెండ్' బయోపిక్‌కు ఎవరూ దొరకట్లేదా.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Aug 2020 10:33 AM GMT
ఆ లెజెండ్ బయోపిక్‌కు ఎవరూ దొరకట్లేదా.?

బాలీవుడ్లో స్పోర్ట్స్ బయోపిక్‌లకు మంచి డిమాండ్ ఉంది. అక్కడ ఆ జానర్లో వచ్చిన సినిమాలు చాలా బాగా ఆడాయి కూడా. ‘బాగ్ మిల్కా బాగ్’, ‘ఎం.ఎస్.ధోని’ లాంటి సినిమాలు అందుకు ఉదాహరణ. ఈ కోవలో మన దగ్గరా క్రీడా దిగ్గజాల జీవిత కథల్ని తెరమీదికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ.. అవి ఒక పట్టాన తేలట్లేదు.

గోపీచంద్ బయోపిక్ కోసం కొన్నేళ్లుగా సన్నాహాలు చేస్తున్నారు కానీ.. అది ఎంతకీ తేలట్లేదు. సింధు, సైనా బయోపిక్స్ విషయంలోనూ ఆలస్యం జరుగుతోంది. ఈలోపు కరణం మల్లీశ్వరి బయోపిక్ తెరపైకి వచ్చింది. పై మూడు చిత్రాలకు సన్నాహాలు చేసింది బాలీవుడ్ నిర్మాణ సంస్థలు కాగా.. మల్లీశ్వరి బయోపిక్‌ను మాత్రం పూర్తిగా ఇక్కడి వాళ్లే తీయబోతున్నారు.

కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. సంజన రెడ్డి దర్శకురాలు. ఐతే సినిమా అనౌన్స్ చేసి నెలలు గడుస్తున్నా.. లీడ్ యాక్టర్ ఎవరన్నది తెలియడం లేదు. సైనా, సింధు, సానియా లాంటి వాళ్ల పాత్రలకైనా ఈజీగానే నటులు దొరికేస్తారేమో కానీ.. మల్లీశ్వరి క్యారెక్టర్‌కు సరైన వాళ్లు దొరకడం అంత తేలిక కాదు. లుక్స్ పరంగా ఇప్పుడున్న హీరోయిన్లెవ్వరూ ఆమెను మ్యాచ్ చేయలేరు.

మేకప్ ద్వారా ఎంత కష్టపడ్డా కూడా మళ్లీశ్వరి లుక్ లోకి తీసుకురావడం కష్టం. ఆమె పోలికలు లేని గ్లామర్ హీరోయిన్లను పెడితే సినిమా ఎసెన్సే దెబ్బ తింటుంది. ఆ పాత్రలో మల్లీశ్వరిని చూసుకోలేరు. తాప్సి అని, రకుల్ ప్రీత్ అని కొన్ని పేర్లు వినిపించాయి కానీ.. ఎవరూ ఈ పాత్రకు ఓకే చెప్పలేదు.

మల్లీశ్వరిలా కనిపించేందుకు బరువు పెరిగి, డీగ్లామరైజ్‌గా తయారైతే కెరీర్ దెబ్బ తింటుందేమో అన్న భయాలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు అనుష్క ‘సైజ్ జీరో’ కోసం అవతారం మార్చుకుని ఎంతలా ఇబ్బంది పడిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఏ హీరోయిన్ని అడిగినా సానుకూలంగా మాట్లాడట్లేదట. దీంతో మల్లీశ్వరి పాత్ర కోసం లీడ్ యాక్టర్‌ను ఎంచుకోవడం చాలా కష్టమయ్యేలాగే ఉంది చిత్ర బృందానికి.

Next Story