హిందుత్వ ఎజెండాను వ‌దిలిపెట్టే ప్ర‌స‌క్తే లేదు: సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే

By Newsmeter.Network  Published on  2 Dec 2019 5:27 PM IST
హిందుత్వ ఎజెండాను వ‌దిలిపెట్టే ప్ర‌స‌క్తే లేదు: సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే

మ‌హారాష్ట్ర రాజ‌కీయాలు ఎప్ప‌టిక‌ప్పుడు కీల‌క మ‌లుపులు తిరిగాయి. ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌లైన నాటి నుంచి రాజ‌కీయ వేడి అంత‌కంత‌కు పెరిగింది. ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయాల మ‌ధ్య సీఎంగా ఫ‌ఢ్న‌వీస్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణస్వీకారం చేసిన ఒక రోజులోనే ఫ‌డ్న‌వీస్ రాజీనామా చేశారు. దీంతో 'మ‌హా' రాజ‌కీయాలు తీవ్ర‌స్థాయికి చేరాయి. చివ‌ర‌కు ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్య‌మంత్రిగా ఉద్ధ‌వ్ ఠాక్రే ప్ర‌మాణ స్వీకారం చేసేశారు.

కాగా, హిందుత్వ ఎజెండాను తాను ఎట్టిప‌రిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఆదివారం ప్రతిపక్ష నాయకుడిగా బీజేపీ శాసనసభా పక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ పేరుని ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సభనుద్దేశించి మాట్లాడారు. హిందుత్వ భావజాలాన్ని శివసేన వీడబోదని, నా నుంచి దానిని ఎవ‌రు దూరం చేయ‌లేర‌ని ఠాక్రే పేర్కొన్నారు. ఫడ్నవీస్ పై కొంచెం ఇష్టం, కొంచెం కష్టంగా ఠాక్రే ప్రసంగం సాగింది. ఎన్నికలకు ముందు ఫడ్నవీస్‌ మళ్లీ నేనే వస్తా అన్న విష‌యాన్ని పరోక్షంగా ప్రస్తావించారు ముఖ్య‌మంత్రి. అయితే మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ పై ఆయ‌న ప్రశంసలు కురిపించారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ప్రతిపక్ష (బీజేపీ) నేతగా ఫడణవీస్, స్వీక‌ర్‌గా నానా పటోలె ఎన్నికైన సందర్భంగా సభ్యులనుద్దేశించి ఉద్ధవ్ ప్రసంగించారు. ఫడణవీస్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, ఆయనతో ఎప్పటికీ స్నేహంగానే ఉంటానని ప్రకటించారు. ఫడణవీస్‌ను ప్రతిపక్ష నేతగా సంభోదించన‌ని చెప్పుకొచ్చారు. బాధ్యత గల నేత అని పిలుస్తానని అన్నారు. మీరు మాతో బాగుండి ఉంటే బీజేపీ, శివసేన విడిపోయేవి కావు’ అని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వానికి తాము ఏనాడూ నమ్మకద్రోహం చేయలేదని గుర్తు చేశారు.

ఇక తాను 'లక్కీ సీఎంను' అని ఉద్ధవ్ అన్నారు. తనను వ్యతిరేకించినవారు ప్రస్తుతం తనతో ఉన్నారని, తనతో కలిసి ఉన్నవారు ఇప్పుడు ప్రత్యర్థులుగా ఉన్నారని అన్నారు. అయితే అంతకు ముందు బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఫడణవీను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరోవైపు అసెంబ్లీ స్పీకర్ పదవికి కిషన్ కిశోర్‌ను పోటీకి దించిన బీజేపీ.. ఆదివారం అభ్యర్థిని ఉపసంహరించుకుంది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే నానా పటోలె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, రైతుల సాధ‌క‌బాధ‌కాలు తెలిసిన వ్య‌క్తి స్పీకర్ ప‌ద‌వి వ‌రించ‌డం ఎంతో హర్షణీయమని ఠాక్రే వ్యాఖ్యానించారు. స్పీకర్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న సంప్రదాయాన్ని కొనసాగించడానికే రేసు నుంచి తప్పుకున్నట్టు బీజేపీ శాసనసభా పక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ వెల్లడించారు. స్వీక‌ర్‌ నానా పటోలె 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ను వీడి క‌మ‌లం పార్టీలో చేరారు. లోక్‌సభకు కూడా ఎన్నికయ్యారు. కానీ ప్రధాని మోదీ, దేవేంద్ర ఫడ్నవీస్‌లతో విభేదాల కారణంగా 2017లో తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. కాగా, విదర్భ ప్రాంతంలోని సకోలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పటోలె ఇటీవల ఎన్నికయ్యారు.

Next Story