మానవత్వం మరచి డెడ్ బాడీ ఫోటోలను పోస్టు చేస్తున్నారా.. శిక్ష తప్పదు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Jun 2020 7:03 AM GMT
మానవత్వం మరచి డెడ్ బాడీ ఫోటోలను పోస్టు చేస్తున్నారా.. శిక్ష తప్పదు..!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేవలం 34 సంవత్సరాల వయసులో సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచివేసింది. ‘ధోని ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ కెరీర్ ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటుందని అందరూ భావించారు. కానీ అతడు మానసిక క్షోభతో బలవన్మరణానికి పాల్పడ్డాడు.

లాక్ డౌన్ నేపథ్యంలో బాంద్రాలోని తన నివాసంలో ఒంటరిగా ఉంటున్నాడు. కొన్నిరోజులుగా అతని పరిస్థితి ఏమీ బాగాలేదని, ఉరేసుకుని చనిపోయినట్టు భావిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. సుశాంత్ సింగ్ పోస్టుమార్టం రిపోర్టును వైద్యాధికారులు విడుదల చేశారు. మెడకు ఉచ్చు గట్టిగా బిగుసుకోవడంతో, ఊపిరి ఆడక, నరాలు తెగి ఆయన మరణించినట్టు అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెడ్ బాడీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. కొన్ని మీడియా సంస్థలు కూడా అతడి డెడ్ బాడీ ఫోటోలను చాలా ఎక్కువగా వాడుకున్నాయి. యుట్యూబ్ థంబ్ నెయిల్స్ లో కూడా ఫోటోలను ఉంచారు. ఇలా డెడ్ బాడీ ఫోటోలను వాడడం తప్పని తెలిసినా కూడా సర్క్యులేషన్ కోసం సోషల్ మీడియాలో షేర్ చేయడం మొదలుపెట్టారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృత‌దేహానికి చెందిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిపై మ‌హారాష్ట్ర సైబ‌ర్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. సుశాంత్ మృత‌దేహం ఫోటోల‌ను స‌ర్క్యూలేట్ చేయ‌రాదంటూ సైబ‌ర్ సెక్యూర్టీ ఏజెన్సీ వార్నింగ్ ఇచ్చింది. సైబ‌ర్ శాఖ త‌మ ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఈ విష‌యాన్ని పోస్టు చేసింది. డెడ్ బాడీకి సంబంధించిన ఫోటోల‌ను పోస్టు చేసిన వారిపై చట్టప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. పలువురు ప్రముఖులు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెడ్ బాడీ ఫోటోలను షేర్ చేయకూడదని కోరారు.

Next Story
Share it