భారత్ లో కరోనా మరణాల రేటు 2.2 శాతం మాత్రమే ఉండడంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకుంటూ ఉంటున్నారు. భారత్ లో మరణాల రేటు తక్కువగా ఉండడం పట్ల ప్రముఖ రీసెర్చర్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సమాధానం భారత్ కు చెందిన డాక్టర్లు చెబుతూ ఉన్నారు.

టాటా మెమోరియల్ సెంటర్ (టి.ఎం.సి.) ముంబైకి చెందిన డాక్టర్లు భారత్ లో కరోనా మరణాలు తక్కువగా ఉండడానికి కారణం భౌగోళిక పరిస్థితులేనని చెబుతున్నారు. భూమధ్యరేఖకు భారత్ దగ్గరగా ఉండడం వలన భారత్ లోని వాతావరణంలో వేడి ఎక్కువగా ఉంటుంది. వేడి ప్రదేశాల్లో నరాల్లో రక్తం గడ్డకట్టడం తక్కువగా జరుగుతూ ఉంటుంది. భారత్ భౌగోళిక పరిస్థితులే కరోనా నుండి కాపాడుతున్నాయని చెబుతున్నారు. ఐసిఎంఆర్ కు చెందిన ఇండియన్ జర్నల్ ఫర్ మెడికల్ రీసర్చ్ అందుకు సంబంధించిన స్టడీని పబ్లిష్ చేసింది.

భారత్ లో మరణాల రేటు 2.2 శాతం మాత్రమే ఉండగా.. యునైటెడ్ కింగ్డమ్ లో 15.2 శాతం, ఇటలీలో 14.2 శాతం, స్పెయిన్ లో 10 శాతం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కోవిద్ మరణాల రేటు 3.8 శాతం ఉంది. చైనా, యూరప్, అమెరికా దేశాలలో మరణాలు సంభవించడానికి కారణం నరాలలో రక్తం గడ్డకట్టడమేనని పలు స్టడీల ద్వారా తెలుస్తోంది. లోతైన సిరలలో ‘వెనస్ త్రొమ్బోఎంబాలిజం(విటిఈ)’ కారణంగా మరణాలు చోటుచేసుకున్నాయని రీసెర్చర్లు తెలిపారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.