మరోసారి మారిటోరియం ఉంటుందా? ఉండదా?

By సుభాష్  Published on  1 Aug 2020 5:34 AM GMT
మరోసారి మారిటోరియం ఉంటుందా? ఉండదా?

కరోనా వేళ.. ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తొలుత లాక్ డౌన్ తో వ్యాపారాలు.. ఉద్యోగాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. అల్ లాక్ ప్రక్రియ మొదలై తర్వాత దశల వారీగా ప్రభుత్వాలు మినహాయింపులు ఇస్తున్నా.. వ్యాపారాలు ఏవీ గతంలో మాదిరి ఒక కొలిక్కి వచ్చింది లేదు. ఆ మాటకు వస్తే.. చాలా వ్యాపారాలు షురూనే కాలేదు. వ్యాపారం చేయాలని ఉన్నా.. పెరుగుతున్న కేసుల భయంతో వ్యాపారస్తులు వణికిపోయే పరిస్థితి.

వీలైనంత సేఫ్ గా ఉంటూ.. జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాపారాలు కొందరు చేస్తుంటే.. మరికొందరు అరకొర వ్యాపారాల ఒరిగే లాభం ఏమీ ఉండదని భావిస్తూ.. వ్యాపారాల్ని తిరిగి స్టార్ట్ చేయలేదు. దీంతో.. లక్షలాది చిన్న ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారింది. ఐటీ లాంటి కంపెనీలు వర్క్ ఫ్రం హోం అంటూ పని చేయటం బాగానే ఉన్నా.. ఆఫీసుల్లో పని చేసే కింది తరగతి ఉద్యోగులు.. ఐటీ ఉద్యోగులకు నిత్యం అవసరమైన రవాణా రంగాలకు సంబంధించిన తీవ్రమైన ప్రభావానికి గురయ్యారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. అన్ని వైపుల నుంచి కరోనా ప్రభావం తరుముకు రావటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఇలాంటివేళ.. వ్యాపారాల కోసం తీసుకున్న రుణాలు.. ఉద్యోగాలు బాగున్నాయన్న ఉద్దేశంతో పలు రకాల రుణాలు తీసుకున్న ఉద్యోగులు కిందామీదా పడిపోతున్నారు. ఇలాంటివారికి వెసులుబాటు కల్పించేందుకు వీలుగా రుణాల ఈఎంఐలను తాత్కాలికంగా తిరిగి చెల్లించే విషయంలో మినహాయింపులు ఇస్తూ మూడు నెలలకు మారిటోరియం అవకాశం ఇచ్చారు. అనంతరం మరో మూడు నెలలకు కొనసాగించారు. ఇది కాస్తా.. ఈ నెల (ఆగస్టు) 31తో ముగియనుంది. మరి.. తర్వాత సంగతేమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

వాస్తవానికి లాక్ డౌన్ తో పోలిస్తే పరిస్థితి కాస్త మెరుగుపడినా.. పూర్తిస్థాయిలో బాగున్న పరిస్థితి లేదు. కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో ఎప్పుడు.. ఎవరు వైరస్ బారిన పడతారన్నది తెలీని పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కరోనా అన్నది ఇప్పట్లో తేలేది కాదు. కనీసం వచ్చే ఏడాది మార్చి వరకూ ఇలాంటి పరిస్థితే ఉంటుందన్న విషయాన్ని అర్థం చేసుకుంటున్న కొన్ని వ్యాపార సంస్థలు.. శాశ్వితంగా మూసేందుకు సిద్ధమవుతున్నాయి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో రుణాల ఈఎంఐలు చెల్లించటం కష్టసాధ్యమన్న వాదన వినిపిస్తోంది. అదే సమయంలో బ్యాంకుల వాదన ఇందుకు భిన్నంగా ఉంది. ఆర్నెల్లు సరిపోతుంది. మరింతకాలం మారిటోరియం పొడిగిస్తే బ్యాంకులకు ఇబ్బందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలు తీసుకున్న రుణాలకు మారిటోరియం పొడిగించే విషయం మీద ఆర్ బీఐతో మాట్లాడుతున్నట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

అన్ని రంగాల్లోకి అతిధ్య రంగానికి ఊతమిచ్చేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తున్నట్లుగా ఆమె చెప్పారు. దీంతో మారిటోరియం మీద కొత్త ఆశలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. మారిటోరియం గడువును పెంచాల్సిన అవసరం లేదని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్ బీఐ ఛైర్మన్ రజ్నేశ్ కుమార్ చెబుతున్నారు. ఇప్పటికి ఇచ్చింది చాలు..ఇకపై ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని.. తిరిగి చెల్లించే స్తోమత ఉన్నా చెల్లించటం లేదంటున్నారు. ఈ రెండు వాదనలు బలంగా వినిపిస్తున్న వేళ.. కేంద్రం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Next Story