త్వరలో నూతన పర్యాటక పాలసీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Aug 2020 3:17 AM GMT
త్వరలో నూతన పర్యాటక పాలసీ

అమ‌రావ‌తి : ఆగస్టు మొదటి వారంలో పర్యాటక ప్రాంతాల్లోకి సందర్శకులను అనుమతిస్తామని, అదే నెల 15వ తేదీ నుంచి బోటు టూరిజం ప్రారంభించనున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. త్వరలో నూతన పర్యాటక పాలసీని తీసుకొస్తున్నామన్నారు. సచివాయలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొవిడ్ కారణంగా రాష్ట్రంలో పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతిందని, దీనివల్ల ముఖ్యంగా ఆదాయం పడిపోయిందని అన్నారు. పర్యాటక రంగంలో ఆదాయం పెంపుదలకు చర్యలు చేపట్టామన్నారు. వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రాంతాల సందర్శనకు అమనుతిస్తామన్నారు. ఆగస్టు 15 వ తేదీ నుంచి బోటు టూరిజానికి అనుమతివ్వనున్నామన్నారు. దీనిలో భాగంగా పర్యాటక ప్రాంతాలను సిద్ధం చేయాలని 13 జిల్లాల పర్యాటక శాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆదేశించామన్నారు.

త్వరలో నూతన టూరిజం పాలసీ

ఏపీలో పర్యాటక రంగానికి అపార అవకాశాలున్నాయని మంత్రి తెలిపారు. అడ్వెంచర్ టూరిజం చిత్తూరులోని హార్సలీ హిల్స్ లో ఉందని, అదే బాటలో రివర్ టూరిజం, బీచ్ టూరిజంతో పాటు ఎకో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేయనున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.. సీఎం వైఎస్ జగన్ అనుమతితో త్వరలో నూతన టూరిజం పాలసీని తీసుకురానున్నామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పది 5 స్టార్, 7 స్టార్ హోటళ్ల నిర్మించనున్నామన్నారు. రాష్ట్రంలో రూ.1000 కోట్ల విలువైన పనుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని మంత్రి వెల్లడించారు.

సీఎం జగన్ చేతుల మీదుగా ‘ప్రసాద్‘ పథకానికి శ్రీకారం

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రసాద్ పథకం కింద సింహాచలం దేవస్థానం ఎంపికవ్వడంపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఆనందం వ్యక్తంచేశారు. తిరుపతి, ద్వారకా తిరుమల, సింహాచలం దేవస్థానాలను ప్రసాద్ పథకం కింద సిఫార్సు చేశామన్నారు. వాటిలో సింహాచలం దేవస్థానాన్ని ప్రసాద్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. మరిన్ని దేవాలయాలను ప్రసాద్ పథకం కింద గుర్తించేలా కేంద్ర ప్రభుత్వంతో తమ అధికారులు చర్చించనున్నారన్నారు. ప్రసాద్ పథకం కింద రూ.53 కోట్ల విలువైన పనులను సింహాచలం దేవస్థానంలో చేపట్టాలని అధికారులను ఆదేశించామని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఈ పథకం కింద ఎంపికైన శ్రీశైలం దేవస్థానంతో పాటు సింహాచలం దేవస్థానంలో పనులను త్వరలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

రూ.12 కోట్లతో 4 క్రీడా వికాస్ కేంద్రాలు

రాష్ట్రంలో క్రీడా రంగం అభివృద్ధే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో రూ.12 కోట్లతో నాలుగు క్రీడా వికాస్ కేంద్రాలు ప్రారంభించనున్నామన్నారు. వాటిలో గుంటూరు జిల్లాలోని బాపట్ల, తెనాలి, మాచర్లలో 3, తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలో ఒక క్రీడా వికాస్ కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విశాఖలో పీవీ సింధు టెన్నిస్ అకాడమీకి భూమి కేటాయించాలని కలెక్టర్ ను ఆదేశించామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి కొవిడ్ మార్గదర్శకాలకనుగుణంగా రాష్ట్రంలో జిమ్ ల ప్రారంభానికి త్వరలో అనుమతులివ్వనున్నట్లు మంత్రి తెలిపారు. జిమ్ లను షిఫ్ట్ ల పద్ధతిలో నిర్వహణకు అనుమతులిస్తామన్నారు. ఖేల్ ఇండియాలో భాగంగా రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపించామని మంత్రి తెలిపారు.

వైఎస్సార్ క్రీడా ప్రోత్సాహాకాలకు దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్రంలో పేద క్రీడాకారులకు అండగా నిలవాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. వైఎస్సార్ క్రీడా ప్రోత్సాహాకాల పథకం కింద గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రూ.3 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించిన వారికి రూ.5 లక్షలు, వెండి పతక విజేతకు రూ.3 లక్షలు, రజతం సాధించిన వారికి రూ.2 లక్షల చొప్పున్న ప్రోత్సాహాకాలు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. వైఎస్సార్ క్రీడా ప్రోత్సాహాకాల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో టూరిజంతో పాటు క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.

ఈ సమావేశంలో శాప్ ఎండి బి.రామారావు, అడిషనల్ డైరెక్టర్ ఎస్.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

హోటళ్ల ఆక్యూపెన్సీ పెంచండి

అంతకుముందు తన కార్యాలయంలో 13 జిల్లాల అధికారులతో మంత్రి అవంతి శ్రీనివాస్...రాష్ట్రంలో పర్యాటక రంగంలో పూర్వవైభవానికి తీసుకోవాల్సిన చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్ -19 కారణంగా పర్యాటక హోటళ్ల ఆదాయం 75 శాతం పడిపోయిందని మంత్రికి అధికారులు వివరించారు. పర్యాటక హోటళ్లల్లో ఆక్యూపెన్సీ పెంపుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఏపీటీఏ సీఈవో, ఏపీటీడీసీ ఎండి ప్రవీణ్ కుమార్, శాప్ ఎండి బి.రామారావు, అడిషనల్ డైరెక్టర్ ఎస్.వెంకటరమణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Next Story
Share it