మహబూబాబాద్‌ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

By సుభాష్  Published on  16 July 2020 9:11 AM IST
మహబూబాబాద్‌ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తొర్రూరు మండలం చీకటాయపాలెం చెరువు కట్టపై అర్థరాత్రి తుమ్మకర్రల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి. అయితే మొత్తం 11 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. మృతులంతా రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆంబోతుతండాకు చెందిన గోవింద్‌ (36), హార్యా (35), మధు (33), రాట్ల ధూర్యా (35)గా గుర్తించారు. ఇక లారీ క్యాబిన్‌లో కూర్చున్న ఏడుగురికి గాయాలు కావడంతో మహబూబాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

కాగా, రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆంబోతు తండాకు చెందిన 11 మంది కూలీలు చీకటాయపాలెం పరిసర ప్రాంతాల్లో తుమ్మకర్రలను కొనుగోలు చేసి, వాటిని హైదరాబాద్‌కు తరలించేందుకు కూలీలు పనులకు వెళ్లారు. ఇక కర్రలను తరలించి స్వగ్రామానికి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే అర్థరాత్రి ఈ ప్రమాదం జరుగగా, గురువారం తెల్లవారుజామున మృతదేహాలను వెలికి తీసినట్లు పోలీసులు తెలిపారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story