మిడతల దండుపై పోరుకు కేసీఆర్ మాస్టర్ ప్లాన్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 May 2020 12:25 PM ISTఇప్పటికే పలు రాష్ట్రాల్ని వణికించిన మిడతల దండు.. గాలి వాటంతో రూటు మార్చి తెలంగాణలోకి వస్తే ఏం చేయాలి? అన్న అంశంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోకస్ చేశారు. కోట్లాది దండు ఒక్కసారిగా విరుచుకుపడితే.. వేలాది ఎకరాలు హాంఫట్ ఖాయం. ఇప్పటికే వాటి జోరు ఎంతలా ఉంటుందన్న విషయం రాజస్థాన్.. మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో చూసిందే.
ఇలాంటివేళ.. తెలంగాణకు మిడతల దండు ముప్పు విరుచుకుపడితే చేయాల్సిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను సీఎం కేసీఆర్ రెఢీ చేసేశారు. మిడతలపై పోరులో మహారాష్ట్ర.. మధ్యప్రదేశ్ సరిహద్దుల్లోని గోండియా ప్రాంతంలో కొంతమేర విజయాన్ని సాధించినట్లుగా చెబుతున్నారు. దీంతో.. అక్కడ ప్రయోగించిన ఫార్ములాను తెలంగాణలో రిపీట్ చేయాలన్న యోచనలో ఉన్నారని చెబుతున్నారు.
ఇంతకూ మహారాష్ట్ర.. ఛత్తీస్ గడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో 15వేల లీటర్ల మలాతియాన్.. క్లోరోఫైరిపాస్.. లామ్డా సైలోత్రిన్ ద్రావణాల్ని మిడతల దండు మీద ప్రయోగించారు. ఈ ప్రయోగం విజయవంతమైందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సరిహద్దుల్లోనూ ఈ ద్రావణాలతో కూడిన 12 అగ్నిమాపక ఫైర్ ఇంజిన్లు.. 12 జెట్టింగ్ యంత్రాల్ని సిద్ధంగా ఉంచుతున్నారు. అంతేకాదు.. సరిహద్దు రాష్ట్రాలతో టచ్ లో ఉండి.. అక్కడ నుంచి వచ్చే మిడతల దండు కదలికపైన డేగకన్ను వేయాలన్నది సారు ఆదేశం. మరి.. ఆయా రాష్ట్రాలు అమలు చేసిన ప్లాన్ ను కాపీ కట్ పేస్ట్ చేస్తే ఎంతమేర ప్రయోజనం అన్నది ఇప్పుడు చూడాలి.