పాక్‌ నుంచి వచ్చాయి.. వణికిస్తున్నాయి

By సుభాష్  Published on  27 Dec 2019 8:56 AM IST
పాక్‌ నుంచి వచ్చాయి.. వణికిస్తున్నాయి

భారత్‌ సరిహద్దులోకి పాక్‌ నుంచి ఉగ్రవాదులే కాదు.. మిడతలు కూడా చొరబడుతున్నాయి. అడవుల్లో నుంచి వచ్చిన ఏనుగులు ఊర్లమీద, పంట పొలాల మీద దాడి చేయడం కూడా చూసి ఉంటారు. కానీ మిడతల దండు దాడి చేయడం మీరు ఎప్పుడైనా చూసారా. ఏదో తమిళ్ సినిమాలో చూసి ఉంటారు. అయితే అది క్రియేషన్ అని కొట్టి పడేసి ఉంటారు. కానీ ఆ సంఘటన నిజంగా జరిగింది. ఎక్కడో కాదు మన గుజరాత్‌లో. వీటిని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నానా తంటాలు పడుతున్నారు. సమస్య తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం 11 బృందాలను గుజరాత్‌కు పంపింది. గత కొద్దిరోజులుగా ఈ మిడతలు సమూహాలుగా వచ్చి బనాస్‌కాంఠా, మెహసాణా, కచ్‌, పాఠన్‌, సాబర్‌కాంఠా జిల్లాల్లో ఆవాలు, జీలకర్ర, ఆముదం, బంగాళ దుంప, గోధుమ, పత్తి, జట్రోఫా వంటి పంటలను నాశనం చేస్తున్నాయి. ఈ బెడదను ఎదుర్కొవడానికి డ్రోన్ల సాయంతో క్రిమిసంహారక మందులను చల్లడం సహా అనేక మార్గాలను అధికారులు పరిశీలిస్తున్నారు. పొలాల్లో టైర్లను మండించడం, డప్పు, ప్లేట్లను మోగించడం కొందరు రైతులు చేస్తుంటే, పొలాల వద్ద టేబుల్‌ ఫ్యాన్‌లు పెట్టడం, లౌడ్‌ స్పీకర్లతో సంగీతాన్ని వినిపించడం ద్వారా ఆ కీటకాలను చెదరగొట్టాలని మరికొందరు రైతులు ప్రయత్నిస్తున్నారు. అయితే వీటితో పెద్దగా ఫలితం ఉండటంలేదు. ఇప్పటివరకూ 25 శాతం మిడతలను నిర్మూలించామని, మరో 4 రోజుల్లో పూర్తిగా వాటి బెడదను తొలగిస్తామని అధికారులు తెలిపారు.

ఇంతకీ ఇవి ఎక్కడినుండి వచ్చాయో తెలుసా.. మన పాకిస్తాన్ నుంచి. అవును నిజం పాకిస్థాన్‌ నుంచి ఉగ్రవాద దండే కాక మిడతల దండు కూడా భారత్‌లోకి చొరబడుతున్నాయన్నమాట. నిజానికి ఈ మిడతలు ఆఫ్రికాలోని సూడాన్‌, ఎరిట్రియా దేశాల నుంచి బయలుదేరాయి. సౌదీ అరేబియా, ఇరాన్‌ ద్వారా పాకిస్థాన్‌లోకి ప్రవేశించాయి. అక్కడి సింధ్‌ రాష్ట్రంలోని ఎడారి ప్రాంతం గుండా భారత్‌కు వచ్చాయి. వీటికి ఎక్కువ దూరం ఎగిరే కెపాసిటీ ఉంది. ఒక్కో దండు విస్తృతి ఏకంగా 30-35 చదరపు కిలోమీటర్ల మేర ఉంటుందట. గుజరాత్‌లో ఈసారి నైరుతి రుతుపవనాలు ఎక్కువ కాలం కొనసాగడంతో ఈ మిడతలు అక్కడే తిష్టవేశాయి. రాజస్థాన్‌లోని కొన్ని జిల్లాలలోనూ ఇవి ఉన్నట్టు గా తెలుస్తోంది. అయితే మిడతల రాకపై ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ హెచ్చరికలు చేసినప్పటికీ స్థానిక అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోలేదని నిపుణులు పేర్కొన్నారు.

Next Story