మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగింపు.. నేడు కేంద్రం అధికారిక ప్రకటన!
By సుభాష్ Published on 17 May 2020 1:03 PM ISTదేశం వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. కేంద్ర విధించిన మూడో దశ లాక్‌డౌన్ మే 17వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరో రెండు వారాల పాటు పొడిగించనుంది. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ జాతినుద్దేశించి మాట్లాడిన ప్రసంగంలో ఈనెల 18 తర్వాత పొడిగించే లాక్‌డౌన్ నిబంధనల్లో మార్పులు ఉంటాయని తెలిపిన విషయం తెలిసిందే. ఇక నేటితో లాక్‌డౌన్ 3.0 ముగియనుంది. రేపటి నుంచి అమలయ్యో లాక్‌డౌన్ ఈనెల 31 వరకూ కొనసాగనుంది. ఆదివారం లాక్‌డౌన్ 4.0పై కేంద్ర అధికారికంగా ప్రకటన చేయనుంది.
లాక్‌డౌన్-4లో మరిన్ని సడలింపులు
ఇక లాక్‌డౌన్ 4.0లో మరిన్ని సడలింపులు ఇవ్వనుంది కేంద్రం. రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తెరిచేందుకు అనుమతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని నిబంధనలు పాటిస్తూ, ప్రజా రవాణాకు కూడా అనుమతి ఇచ్చే అవకాశాలున్నాయి. ఇక విమానం బయలుదేరే ప్రాంతం, గమ్యస్థానం ఉన్న ప్రభుత్వాల మధ్య కుదిరే అంగీకారం మేరకు టేకాఫ్ లు ఉండాలనే కండీషన్లు పెట్టనుంది. నగరాల్లో మెట్రో సేవలు కూడా అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్‌లో మెట్రోరైలు సర్వీసులు నడిపేందుకు తెలంగాణ సర్కార్ సిద్దమవుతోంది.
కాగా, రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి వచ్చిన సూచనలు, సలహాల మేరకు ఇప్పటికే హోంశాఖ లాక్‌డౌన్ 4.0పై విధివిధానాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఆటో రిక్షాలు, క్యాబ్ సర్వీసులు, ఈ-కామర్స్ సంస్థల ద్వారా అత్యవసరం కాని వస్తువుల డెలివరీకి అనుమతి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
కరోనాను అరికట్టేందుకు భారత్‌లో మార్చి 25వ తేదీ నుంచి తొలి విడత లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆపై దానిని ఏప్రిల్ 15 వరకూ, తర్వాత మే 4వ తేదీ వరకూ, మళ్లీ మే 17 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. తాజాగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు అదుపులోకి రాకపోవడంతో మరోసారి లాక్‌డౌన్ పొడిగించనుంది. అయితే ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని నాలుగో దశ లాక్‌డౌన్‌లో మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఏపీలో మాత్రం కరోనా విజృంభిస్తుండగా, తెలంగాణలో తగ్గుముఖం పట్టి.. మళ్లీ విజృంభిస్తోంది. నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్క హైదరాబాద్‌లోనే నమోదవుతుండటం గమనార్హం.