ఫైనాన్స్ తీసుకున్న బస్సు.. అందులో ప్రయాణీకులు.. రికవరీ ఏజెంట్ ఏమి చేశారంటే..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Aug 2020 7:46 AM GMT
ఫైనాన్స్ తీసుకున్న బస్సు.. అందులో ప్రయాణీకులు.. రికవరీ ఏజెంట్ ఏమి చేశారంటే..?

లక్నో: ఉత్తరప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ ను చేతిలో తీసుకున్న మరో ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీకి చెందిన ఏజెంట్లు ఆగ్రాలో బస్సును ఆపారు. ఎవరు మీరు ఏమిటి అని అడిగేలోపే డ్రైవర్ ను, కండక్టర్ ను దింపేశారు. ఆ బస్సులో 34 మంది ప్యాసెంజర్లు ఉండగా.. వారితోనే బస్సు అలా వెళ్ళిపోయింది. ఏమి జరుగుతుందో కూడా ఊహించలేదు ప్రయాణీకులు. గురుగ్రామ్ నుండి మధ్య ప్రదేశ్ కు బస్సు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అలా గుర్తు తెలియని వ్యక్తులు బస్సును తీసుకుని వెళ్తున్నప్పుడు చాలా భయపడ్డామని అన్నారు. ఉత్తర ప్రదేశ్ లో ఇలాంటి ఘటనలు చాలా సాధారణమైపోయాయంటూ పలువురు చెప్పుకొచ్చారు.

అలా బస్సును వాళ్లు తీసుకొని పోగానే బస్సు డ్రైవర్, కండక్టర్ పోలీసులను ఆశ్రయించారు. కొద్దిసేపటికి ఆ బస్సును తీసుకుని వెళ్ళింది ఫైనాన్స్ కంపెనీ వ్యక్తులు అని గుర్తించారు. పోలీసులు ఆ బస్సును ఓ చోట అడ్డుకోగలిగారు. ప్రయాణీకులు అందరూ బాగానే ఉన్నారని.. ఎవరికీ ఏమీ అవ్వలేదని చెప్పుకొచ్చారు. ఈ ఘటనకు బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇంతకూ ఫైనాన్సర్లు ఇలాంటి పని చేయడానికి కారణం ఏమిటో తెలుసా..? బస్సు ఓనర్ చనిపోవడమే..! బస్సు ఓనర్ ఫైనాన్స్ తీసుకుని బస్సును నడుపుతూ ఉన్నారు. ఈ ఘటన చోటుచేసుకున్న ఒక్క రోజు ముందు బస్సు ఓనర్ చనిపోయాడు. అతడి కుటుంబ సభ్యులు ఫైనాన్స్ డబ్బులు తీసుకుంటారో లేదో అనే అనుమానంతో ఫైనాన్స్ కంపెనీ వాళ్లు బస్సును స్వాధీనం చేసుకోవాలని అనుకున్నారు. అనుకున్నట్లుగానే తమ మనుషులకు చెప్పగా వారు.. బస్సులో ఉన్న ప్రయాణీకులను కనీసం కిందకు దింపేయకుండానే బస్సును తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నించారు. దీంతో బస్సులోని ప్రయాణీకులు బాగా టెన్షన్ కు గురయ్యారు.

Next Story