లాంగ్ మార్చ్ స్ఫూర్తితో ముందుకెళ్దాం: పవన్ కల్యాణ్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Nov 2019 5:53 PM ISTముఖ్యాంశాలు
- విశాఖలో జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు
- కష్టపడిన వారికి పార్టీలో పెద్దపీట వేయాలి
విశాఖ: లాంగ్ మార్చ్‌ను విజయవంతం చేసినందుకు విశాఖ జిల్లా జనసేన నాయకులను పవన్ కల్యాణ్ అభినందించారు. సోమవారం విశాఖలోని ఓ హోటల్‌లో జిల్లాకు చెందిన నాయకులతో పవన్ కల్యాణ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రజలలో తీవ్రమైన ఆగ్రహం ఉన్నందునే లాంగ్‌మార్చ్ విజయవంతం అయ్యిందని పవన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలంటూ దిశానిర్దేశం చేశారు. పార్టీని నడపడం ఆర్థిక భారమైనప్పటికీ విశాఖలో జనసేన కార్యాలయాన్ని ఏర్పాటు చేద్దామని, అందుకు సరైన వసతి ప్రాంగణాన్ని సూచించాలని కోరారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలపై కార్యకర్తలను కలుపుకొని వెళ్లి పోరాడాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
ముందస్తు ప్రణాళికతోనే లాంగ్ మార్చ్ విజయం: నాదెండ్ల మనోహర్
నాయకులంతా ముందస్తు ప్రణాళిక ప్రకారం పని చేయడంతోనే ఈ కార్యక్రమం విజయం సాధించిందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
కార్యకర్తలకు నాయకత్వ శిక్షణా ఇవ్వాలి: వి.వి.లక్ష్మీనారాయణ
కార్యకర్తలకు నాయకత్వ లక్షణాలను పెంపొందించే విధంగా నిరంతరాయ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. కార్యకర్తల మీద అక్రమ కేసులు అధికమవుతున్నందున వారికి మద్దతుగా పార్టీ లీగల్ విభాగాన్ని పటిష్టం చేయాలన్నారు.