కురిచేడు శానిటైజర్ ఘటన : వెలుగులోకి సంచలన విషయాలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Aug 2020 12:07 PM ISTప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి 16 మంది మృతి చెందిన ఘటనకు సంబంధించి ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కురిచేడు ఘటనకు హైదరాబాద్‌లో తయారు చేసిన ‘పర్‌ఫెక్ట్’ సొల్యూషన్స్ కారణమని అధికారులు గుర్తించారు.
హైదరాబాద్‌లోని జీడిమెట్ల కేంద్రంగా శ్రీనివాసరావు అనే వ్యక్తి 'పర్‌ఫెక్ట్' శానిటైజర్ తయారు చేస్తున్నారు. పేదరికంలో ఉన్న శ్రీనివాస్ ఆధిక సంపాదనకు ఆకర్షితుడై లాక్‌డౌన్ సమయంలో ఇంట్లోనే శానిటైజర్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. మూడో తరగతి చదివిన శ్రీనివాసరావు.. యూట్యూబ్‌లో వీడియోలు చూసి శానిటైజర్‌లు తయారీ చేస్తున్నట్లు నిర్ధారణయ్యింది.
ఈ క్రమంలోనే శ్రీనివాసరావు పెట్టిన బిజినెస్ పదిరోజులల్లోనే సక్సెస్ కావడం, ఆదాయం కూడా ఆశించిన దానికంటే ఎక్కువగా ఉండటంతో ఈ వ్యాపారాన్ని ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకోసం ఇద్దరు వ్యక్తులను కలిసి హైదరాబాద్ జీడిమెట్లలోని పారిశ్రామికవాడ పైప్‌లైన్ రోడ్డులో పర్‌ఫెక్ట్ కెమికల్స్ అండ్ సాల్వెంట్స్ కంపెనీ ఏర్పాటు చేశాడు.
అక్కడ తయారు చేసిన శానిటైజర్‌ని తెలుగు రాష్ట్రాల్లో విక్రయించడానికి ఇద్దరు పంపిణీ దారులను నియమించుకున్నాడు. అయితే.. పెరిగిన ఖర్చులకు తగిన ఆదాయం రాలేదనే కారణంతో ఇథైల్ ఆల్కాహాల్‌కు బదులుగా మరో ద్రావణాన్ని కలిపి విక్రయించసాగాడు. ఇంతలో కురిచేడు ఘటన వెలుగులోకి రావడం.. సిట్ బృందం విచారణలో ఘటనకు శ్రీనివాసరావు తయారుచేసిన పర్‌ఫెక్ట్ శానిటైజర్ కారణమని తేలడం జరిగింది.