మీ కొడుకులకు సంస్కారం నేర్పించండి : బీజేపీ ఎమ్మెల్యేపై హీరోయిన్ ఫైర్
By న్యూస్‌మీటర్ తెలుగు
హత్రాస్ ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అత్యాచారాలపై ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అధికార బీజేపీపై భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే నేరాన్ని సమర్ధిస్తున్నట్లుగా మహిళలే సంస్కారం నేర్చుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
వివరాళ్లోకెళితే.. బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మాట్లాడుతూ.. అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు తమ కూతుళ్లకు సంస్కారం నేర్పాలని అన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ మండిపడ్డారు. మీ కుమారులకు సంస్కారం నేర్పలేరా? అంటూ ఘాటు విమర్శలు చేశారు.
ఆయన వ్యాఖ్యలు చాలా గందరగోళంగా ఉన్నాయి. అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే కూతుళ్లకు సంస్కారం నేర్పించాలా?.. ఆయన ఏం మాట్లాడుతున్నారో.. కనీసం ఆయనకు ఐనా వినపడుతుందో లేదో? ఇలాంటి ఆలోచనా ధోరణి మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కూతుళ్లకే సంస్కారం నేర్పించాలా? మీ కొడుకులకు సంస్కారం నేర్పించలేరా? అని కృతి సనన్ ట్వీట్ చేశారు.