కోజికోడ్ లో చోటుచేసుకుంది ప్రమాదం కాదు.. మర్డర్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 Aug 2020 2:45 PM GMTకోజికోడ్ లో చోటుచేసుకున్నది ప్రమాదం కాదని మర్డర్ అని అంటున్నాడు ఎయిర్ సేఫ్టీ నిపుణుడు, కెప్టెన్ మోహన్ రంగనాథన్. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే కోజికోడ్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం చోటుచేసుకున్న ఘటనలు పాట్నా, జమ్మూ ఎయిర్ పోర్ట్స్ లో కూడా చోటుచేసుకుంటాయని ఆయన అంటున్నారు. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఆధ్వర్యంలోని సేఫ్టీ అడ్వైజరీ కమిటీ సభ్యుడైన కెప్టెన్ మోహన్ రంగనాథన్ కోజికోడ్ ప్రమాదంలో ముమ్మాటికీ ప్రభుత్వం తప్పు ఉందని చెబుతున్నారు.
తొమ్మిది సంవత్సరాల కిందటే కోజికోడ్(ఒకప్పుడు కాలికట్) ఎయిర్ పోర్ట్ విమానాల ల్యాండింగ్ కు శ్రేయస్కరం కాదని తాను రిపోర్టులు అందించానని ఆయన అన్నారు. తాను చేసిన హెచ్చరికలను కనీసం పట్టించుకోకపోవడం వలనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఆయన చెబుతున్నారు. ఇది ప్రమాదం కాదు.. ముమ్మాటికీ మర్డర్ అని ఆయన అన్నారు.
కోజికోడ్ విమానాశ్రయానికి 'టేబుల్ టాప్' తరహా రన్ వే ఉంది. ఇలాంటి తరహా రన్ వే ల కారణంగా విమానం కొంచెం కంట్రోల్ తప్పినా పెద్ద ప్రమాదం పొంచి ఉంటుంది. కోజికోడ్ రన్ వే పక్కనే 70 మీటర్ల లోతైన ప్రాంతాలు ఉన్నాయి.. మంగళూరు ఎయిర్ పోర్టు విషయంలో 100 మీటర్లు ఉంది.. ఇలాంటి రన్ వేలకు సేఫ్టీ ఫీచర్లు చాలా తక్కువ..! పాట్నా, జమ్మూ ఎయిర్ పోర్టుల రన్ వే విషయంలో కూడా ఇలాంటి ప్రమాదమే పొంచి ఉందని ఆయన చెప్పారు.
దాదాపు 10 సంవత్సరాల క్రితమే తాను సివిల్ ఏవియేషన్ సేఫ్టీ అడ్వైజరీ కౌన్సిల్ (CASAC) కు లెటర్ రాశానని.. కోజికోడ్ రన్ వే 10 ల్యాండింగ్ విషయంలో కాస్త రిస్కీ అని తెలిపినట్లు చెప్పారు. వర్షం పడిన సమయంలో ల్యాండింగ్ కు కష్టం అని సూచించానని.. తన రిపోర్టును ఎవరూ పట్టించుకోలేదని ఆయన అన్నారు.
కోజికోడ్ లో సంభవించిన ఘోర విమాన ప్రమాదంలో చనిపోయిన వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలిందని కేరళ మంత్రి కేటీ జలీల్ తెలిపారు. సుధీర్ వర్యాత్ (45) అనే ప్రయాణికుడి శాంపిల్స్ ను టెస్టింగ్ కు పంపగా.. పాజిటివ్ అని తేలిందని చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత సహాయక చర్యల్లో పాల్గొన్న వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లాలని ఆయన కోరారు. ప్రమాద సమయంలో విమానంలో క్రూ సిబ్బందితో పాటు 190 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 149 మంది క్షతగాత్రులను కోజికోడ్, మలప్పురం జిల్లాల్లోని ఆసుపత్రుల్లో చేర్చారు.
ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. విమానం నుంచి బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారులు తెలిపారు. అందులోని డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ , కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లలో నిక్షిప్తమైన సమాచారాన్ని పరిశీలించనున్నట్లు తెలిపారు.
ల్యాండింగ్ సమయంలో విమానం రన్‌వే నుంచి పక్కకు జరిగి 35 అడుగుల లోయలో పడి రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో పైలట్లు ఇద్దరూ మరణించారు. వింగ్ కమాండర్ దీపక్ వసంత్ సాథే, కెప్టెన్ అఖిలేష్ కుమార్ మరణించారు.