కోజికోడ్ దుర్ఘటనలో దీనంగా చూస్తున్న ఆ చిన్నారి ఎవరు?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Aug 2020 6:54 AM GMT
కోజికోడ్ దుర్ఘటనలో దీనంగా చూస్తున్న ఆ చిన్నారి ఎవరు?

షాకింగ్ గా మారిన కోజికోడ్ విమానాశ్రయంలో చోటు చేసుకున్న విషాదం దేశ ప్రజల్ని ఒక్కసారిగా నిర్ఘాంతపోయేలా చేసింది. కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని తిరిగి తీసుకొచ్చే వందే భారత్ మిషన్ లో భాగంగా నడుపుతున్న విమానానికి ఈ ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో పదిహేడు మంది మరణించగా.. వందమంది గాయాలకు గురయ్యారు. వీరిలో తీవ్రంగా గాయపడిన వారి సంఖ్య ఎక్కువేనని చెబుతున్నారు. రానున్నకొద్ది గంటల్లో మరణాలు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ ప్రమాదం జరిగిన షాక్ లో అందరిని ఒక చిన్నారి ఆకర్షిస్తోంది. బేలగా చూస్తూ.. జరిగిన ప్రమాదపు షాక్ ఆమె కళ్లల్లోకొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. తీవ్రమైన భయంతో ఉన్న ఆ పాపను ఒక కానిస్టేబుల్ చేరతీశారు. జాగ్రత్తగా తన దగ్గర ఉంచుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ.. మీడియాలోనూ వైరల్ గా మారాయి. ప్రమాదం జరిగిన తర్వాత ఒక్కటిగా ఉన్న ఆ పాపకు సంబంధించిన వారి పరిస్థితి ఏమిటన్నది ఇప్పటివరకు తేల్లేదు.

ప్రమాదం జరిగిన నాలుగు గంటల్లో విమానంలో చిక్కుకున్న వారిని జాగ్రత్తగా బయటకు తరలించారు. అలా తీసుకొచ్చిన వారిలో ఈ చిన్నారి ఒకరు. ఆమె తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటన్నది క్లారిటీ రాలేదు. ఆ పాపను చూసిన వారంతా మాత్రం.. ఆ చిన్నారి తల్లిదండ్రులకు ఏమీ కాకూడదని ప్రార్థిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిన్నారి ఆచూకీ తెలిసిన వారు ఎవరైనా ఉంటే.. 9048769169 నెంబరును కాంట్రాక్టు చేయాలని కోజికోడ్ పోలీసులు చెబుతున్నారు.

Next Story