చనిపోయిన ఓనర్.. 71 రోజులుగా ఏటీఎంను తన దగ్గరే పెట్టుకున్న పని మనిషి ఏమి చేసిందంటే..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Aug 2020 3:12 AM GMT
చనిపోయిన ఓనర్.. 71 రోజులుగా ఏటీఎంను తన దగ్గరే పెట్టుకున్న పని మనిషి ఏమి చేసిందంటే..?

కలకత్తా పోలీసులు ఓ పనిమనిషిని అరెస్టు చేశారు. ఇంతకూ ఆ పని మనిషి చేసిన నేరం ఏమిటో తెలుసా..? చనిపోయిన తన యజమానికి చెందిన ఏటీఎం కార్డును విచ్చల విడిగా వాడేయడమే.. తన బంధువులకు చెప్పి ఏటీఎంలో నుండి ఏకంగా 34 లక్షల 90 వేల రూపాయల వరకూ లాగేసింది. దాదాపు 71 రోజులుగా ఆమె అకౌంట్ నుండి డబ్బులను లాగుతోంది.

దక్షిణ కలకత్తాలోని సత్య నారాయణ అగర్వాల్ కొద్దిరోజుల కిందట చనిపోయారు. ఆ సమయంలో వారి ఇంట్లో పని చేస్తున్న 45 సంవత్సరాల రీటా రాయ్ కు ఓ దుర్భుద్ధి పుట్టింది. ఆయనకు చెందిన ఏటీఎంను కాజేసింది. సత్య నారాయణ అగర్వాల్ తరచుగా ఏటీఎం పిన్ ను మరచిపోతూ ఉంటుంటే.. ఆయన కుమారుడు అనురాగ్ ఆయన మొబైల్ ఫోన్ లో పిన్ నంబర్ ను సేవ్ చేసిచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న రీటా రాయ్ ఆ ఏటీఎంను కాజేసింది. ఆయన చనిపోయాక ఏటీఎంను ఉపయోగించి డబ్బులను లాగేయడం మొదలుపెట్టింది. మృతుడి ఖాతాలోంచి డబ్బులు మాయం అవటం గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూన్ 1వ తేదీన కేసును నమోదు చేశారు అధికారులు. దీంతో రంగంలోకి దిగిన డిటెక్టివ్‌ డిపార్ట్‌మెంట్‌ రీటాను అదుపులోకి తీసుకుంది.

రీటాతో పాటూ 31 సంవత్సరాల రంజిత్ మాలిక్, 45 సంవత్సరాల సౌమిత్ర సర్కార్ ను అరెస్ట్ చేశారు. మృతుడి అకౌంట్ యస్ బ్యాంకులో ఉంది. పలు ఏటీఎం సెంటర్లలో డబ్బులను విత్ డ్రా చేయడం మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా రంజిత్, సౌమిత్ర సర్కార్ లు మాస్క్ లు వేసుకుని కనిపించడంతో పోలీసులకు వాళ్ళను గుర్తించడం కూడా కష్టమైంది. దీంతో డిటెక్టివ్ లు స్థానికులను సంప్రదించారు. రీటా రాయ్ మీద అనుమానం రావడంతో ఆమెను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. ఆమెను విచారించగా అసలు విషయం తెలిసింది. నిందితుల దగ్గర నుండి 27లక్షల క్యాష్ ను స్వాధీనం చేసుకున్నారు.

Next Story
Share it