ఘోర రోడ్డు ప్రమాదం.. సినీ నిర్మాత మృతి

By సుభాష్  Published on  19 Aug 2020 10:03 AM GMT
ఘోర రోడ్డు ప్రమాదం.. సినీ నిర్మాత మృతి

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా దామచర్ల మండలం కొండప్రోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కెఎఫ్‌సీ నిర్మాణ సంస్థ మేనేజింగ్‌డైరెక్టర్లలో ఒకరైన నిర్మాత కమలాకర్‌రెడ్డి (40)తో పాటు ఆయన తండ్రి నందగోపాల్‌రెడ్డి (75) మృతి చెందారు. ఇటీవల కమలాకర్‌రెడ్డి తండ్రి నందగోపాల్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయనతో కాంటాక్ట్‌లో ఉన్న నిర్మాత కమలాకర్‌రెడ్డికి కూడా కరోనా వచ్చింది. నెల్లూరు సమీపంలోని ఓ గ్రామంలో ఉంటున్న వీరిద్దరు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు అంబులెన్స్‌లో వస్తుండగా, నల్గొండ జిల్లా దామచర్ల మండలం కొండప్రోలు వద్ద ఆగివున్న లారీని అంబులెన్స్‌ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కమలాకర్‌రెడ్డితో పాటు ఆయన తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అంబులెన్స్‌ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కాగా, కమలాకర్‌రెడ్డి ఈ మధ్య విడుదలైన 'కనులు కనులు దోచాయంటే' సినిమాను కేఎఫ్‌సీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ తెలుగులో విడుదల చేసింది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Next Story
Share it