సంతోషి ఇంటికి సీఎం కేసీఆర్.. ఎందుకు వెళుతున్నారంటే?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Jun 2020 6:25 PM ISTకారణం లేకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పని చేయరు. ఆయన వేసే ప్రతి అడుగు వెనుక చాలానే లెక్కలు ఉంటాయి. తనకు అత్యంత సన్నిహితులకు సైతం అర్థంకాని రీతిలో వ్యవహరించటం ఆయనకు మాత్రమే చెల్లు. భావోద్వేగ రాజకీయాలతో ఉద్యమ నాయకుడిగా ఎదగటమే కాదు.. తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసుకున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో సందర్భానికి తగ్గట్లు ఆయన కొన్ని విమర్శలు చేసే వారు. విచిత్రంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆయన అందుకు భిన్నంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ కోసం తపించిన ప్రముఖులు.. తెలంగాణ శ్వాసగా బతికినోళ్లు మరణిస్తే వారిని కడచూపు చూసేందుకు.. వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
అందుకు భిన్నంగా తాజాగా మాత్రం ఆయన తీసుున్న నిర్ణయం బాగుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందటం తెలిసిందే. యావత్ దేశాన్ని కదిలించిన ఈ ఉదంతంలో సంతోష్ తో పాటు ఇరవై మంది కన్నుమూశారు. మిగిలిన సందర్భాల్లో ఎలా ఉన్నా.. ఇలాంటి భావోద్వేగ అంశాల విషయంలో కేసీఆర్ స్పందన భిన్నంగా ఉంటుంది. ప్రధానమంత్రితో జరిగిన వీడియో కాన్ఫరెన్సు వేళ.. సంతోష్ కుటుంబానికి రూ. 5కోట్లు.. ఆయన సతీమణికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు.. హైదరాబాద్ లో ఇంటి స్థలాన్ని ఇస్తామని పేర్కొన్నారు.
అంతేకాదు.. సంతోష్ తో పాటు మరణించిన వారికి కేంద్రమంత్రి ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల మొత్తాన్ని ఇస్తామని ప్రకటించారు. కేసీఆర్ నుంచి వచ్చిన ప్రకటనకు సర్వత్రా హర్షం వ్యక్తమైంది. దేశం కోసం ప్రాణాలు విడిచిన వీర జవానుల విషయంలోనూ.. వారి కుటుంబాలకు కొంత కొరత తీరేలా ఆయన నిర్ణయం ఉందన్న అభిప్రాయం నెలకొంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన తీసుకున్న మరో నిర్ణయం ఆసక్తికరంగా మారింది. సంతోష్ బాబు ఇంటికి సీఎం స్వయంగా వెళ్లి.. ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కుతో పాటు.. సంతోషిని డిప్యూటీ కలెక్టర్ గా నియమించే ఉత్తర్వులను స్వయంగా అందజేయాలని నిర్ణయించారు. అంతేకాదు.. హైదరాబాద్ జిల్లా షేక్ పేటలో 500 గజాల స్థలాన్ని కేటాయించే జీవో కాపీని అందజేయనున్నారు. చాలా సందర్భాల్లో తన సందేశాన్ని మాత్రమే పంపి ఊరుకునే కేసీఆర్.. అందుకు భిన్నంగా ఇంటికి వెళ్లి మరీ పరామర్శిస్తారన్న మాట ఇప్పుడు చర్చగా మారింది.