కేసీఆర్ లో నచ్చేది ఇదే.. ఇలానే మనసుల్ని దోచేస్తారు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Sept 2020 4:46 PM IST
కేసీఆర్ లో నచ్చేది ఇదే.. ఇలానే మనసుల్ని దోచేస్తారు

ఇప్పటి రాజకీయం మా చెడ్డగా మారిపోయింది. మనోడు కాకుంటే.. చెప్పేది మంచైనా సరే వినే ప్రసక్తే లేదన్నట్లుగా తయారైంది. అధికారంలో ఉన్న వారు ఎవరైనా సరే.. తమకు తోచించి.. తమకు వచ్చిన ఆలోచన మాత్రమే మంచిదని.. అది మాత్రమే ఆచరణ సాధ్యమన్నట్లుగా వ్యవహరించటం కనిపిస్తుంది. అదే సమయంలో విపక్ష నేతల నోటి నుంచి వచ్చే మాటల్ని కనీసం వినేందుకు సైతం ససేమిరా అనే తీరు అంతకంతకూ పెరుగుతోంది. అయితే.. దీనికి భిన్నంగా అప్పడప్పుడు వ్యవహరిస్తూ మనసుల్ని దోచేస్తుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.

తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్నే తీసుకుంటే.. కరోనా ఎపిసోడ్ మీద జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఆసక్తికర అంశాల్ని ప్రస్తావిస్తూ.. వైరస్ వ్యాప్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొన్ని సూచనలు చేశారు. అందులోకొన్ని.. ప్రభుత్వం ఫాలో అయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

అందులో ముఖ్యమైనది పేద వారికి పాజిటివ్ అని తేలితే.. వారిని హోం ఐసోలేషన్ అని ఇంటికి పంపకుండా.. వారికి వైద్యం చేయాలని.. అప్పుడు వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయొచ్చని పేర్కొన్నారు. ఈ సూచనను సీఎం కేసీఆర్ స్వాగతించటం గమనార్హం. కాంగ్రెస్ శాసనసభపక్ష నేత భట్టి ఇచ్చిన సూచనల్లో కొన్ని పరిశీలించేవిగా ఉన్నాయని చెప్పటం ద్వారా.. సమకాలీన రాజకీయాలకు తాను కాస్త భిన్నమన్న విషయాన్ని కేసీఆర్ చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.

ఆయన చేసిన సూచనల్ని పరిగణలోకి తీసుకుంటామని చెబుతూనే.. ప్రభుత్వం సైతం బాగానే చేసిందన్న మాటల్ని చెప్పుకున్నారు. ఇలా చేయటం వల్ల మంచి ఎవరు చెప్పినా వింటామన్న సందేశాన్ని ఇచ్చినట్లు అవుతుంది. విపక్షం సైతం సంతోషిస్తుంది. అందుకు భిన్నంగా మీరు చెప్పే మాటల్లో గొప్పతనం ఏముందంటే.. రగడ తప్పించి ఇంకేం ఉంటుంది?

ఇక్కడ చెప్పొచ్చేదేమంటే.. విపక్ష నేతలు చెప్పే మాటల్ని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోవాలన్న మొండితనం లేకుండా.. వారు చెప్పేవాటిని తాము పరిశీలిస్తామని చెప్పటం ద్వారా అటు విపక్షం.. ఇటు ప్రజల మనసుల్ని దోచేస్తున్నారని చెప్పకతప్పదు. ఇలాంటి తీరుతోనే.. కేసీఆర్ అందరూ ఒప్పుకునే నేతగా మారారని చెప్పాలి. కొన్ని సందర్భాల్లో కేసీఆర్ అంటే కోపంతో ఉన్న వారు సైతం.. ఎన్నికలు వచ్చేసరికి.. ఉన్నోళ్లలో కేసీఆరే బెటర్ అని భావించటం.. అధికారం అప్పగించటం చూస్తున్నదే. ఒకవిధంగా చూస్తే.. కేసీఆర్ వైఖరే ఆయనకు శ్రీరామరక్షగా చెప్పక తప్పదు.

Next Story