కేసీఆర్ కసరత్తు.. రేసులో ఆశావాహులు.. పదవులు దక్కేదెవరికి?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Aug 2020 6:24 AM GMT
కేసీఆర్ కసరత్తు.. రేసులో ఆశావాహులు.. పదవులు దక్కేదెవరికి?

తెలంగాణలో ఖాళీగా ఉన్న శాసన మండలి స్థానాల్ని భర్తీ చేసే విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించినట్లుగా చెబుతున్నారు. వచ్చే నెల ఏడున రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు షురూ కానున్న నేపథ్యంలో.. అప్పటికి ఖాళీగా ఉన్న స్థానాల్ని భర్తీ చేయాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. త్వరలో నిర్వహించే కేబినెట్ భేటీలో చర్చించి.. జాబితాపై తమ నిర్ణయాన్ని గవర్నర్ కు పంపే అవకాశం ఉందంటున్నారు.

గవర్నర్ కోటాలో తాజాగా ముగ్గురిని నియమించేందుకు అవకాశం ఉండటంతో.. ఎంపిక అంశంపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. నలభై మంది సభ్యులున్న మండలిలో నాలుగు ఖాళీ స్థానాలు ఉన్నాయి. ఇందులో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఖాళీగా ఉండటం.. దానికి షెడ్యూల్ ప్రకటించారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా కవిత పేరును ప్రకటించారు. అయితే.. కరోనా నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారు.

గవర్నర్ కోటా సభ్యుల సంఖ్య ఆరు అయితే.. ప్రస్తుతం మూడు ఖాళీలు ఉన్నాయి. దీంతో.. ఈ మూడింటికి సంబంధించి పలువురు నేతలు పదవులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పదవుల్ని ఆశిస్తున్న వారిలో సీఎంవో ఓఎస్ డీ దేశపతి శ్రీనివాస్.. బ్రూవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దేవీప్రసాద్.. పార్టీ నేత తక్కళ్లపల్లి రవీంద్రరావుతో పాటు.. మాజీ ప్రధాని పీవీ కుమార్తె వాణీదేవి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

వీరే కాకుండా ఇప్పటికే ఎమ్మెల్సీలుగా వ్యవహరించి పదవీకాలం పూర్తి అయిన మాజీ హోంమంత్రి నాయిని తనకు అవకాశం వస్తుందని భావిస్తున్నారు. ఒకవేళ.. తనకు అవకాశం ఇవ్వని పక్షంలో తన అల్లుడికి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నారు. వీరితో పాటు.. మంత్రి మల్లారెడ్డి అల్లుడు కమ్ ఏడాది క్రిత జరిగిన ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన రాజశేఖర్ రెడ్డి కూడా పదవుల్ని ఆశిస్తున్నారు. ఉన్న మూడు స్థానాలకు ఇంతమంది ఆశావాహులు ఉండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికి అవకాశం కల్పిస్తారన్నది ప్రశ్నగా మారింది.

Next Story