పంట ప్లానింగ్‌లో కీలకమైన పాయింట్‌ను కేసీఆర్ మిస్ అయ్యారా?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 Jun 2020 3:38 PM ISTఏదైనా విషయం మీద ఫోకస్ పెడితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత లోతుల్లోకి వెళతారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తాను ప్రాధాన్యత ఇవ్వాలనుకున్న అంశం మీద తనకు తానుగా అవగాహన పెంచుకోవటమే కాదు.. ఆయా రంగంలో నిపుణులైన వారు సైతం అచ్చెరువు చెందేలా సబ్జెక్ట్ మీద కమాండ్ తెచ్చుకోవటం కేసీఆర్ కున్న ప్రత్యేక బలంగా చెబుతారు. వినూత్న పథకాల్ని తెర మీదకు తీసుకురావటం.. ఇప్పటివరకూ పాలకులు అనుసరించిన విధానాలకు భిన్నంగా వ్యవహరించటం ఆయనకే చెల్లు.
ఈ మధ్యన తెలంగాణ రాష్ట్రంలోని రైతులు అంతా ప్రభుత్వ చెప్పిన పంటల్ని మాత్రమే వేయాలని.. ఒకవేళ అలా వేయకుంటే ప్రభుత్వం ఏడాదిలో రెండుసార్లు ఇచ్చే రైతుబంధును ఇవ్వమని చెప్పే దమ్ము.. ధైర్యం కేసీఆర్ కు సొంతం. ప్రభుత్వం అమలు చేసే పథకాలకు సంబంధించి ఇంతలా రూల్స్ పెట్టే ముఖ్యమంత్రులు దేశంలో పెద్దగా కనిపించరు. మరిన్ని రూల్స్ పెడతున్న కేసీఆర్.. తాను ప్లాన్ చేసిన పంట వ్యూహంలో కీలకమైన ఒక పాయింట్ ను మర్చిపోయినట్లు చెబుతున్నారు.
అదేమంటే కేసీఆర్ ప్లానింగ్ లో పశువుల మేతకు సంబంధించిన పాయింట్ ను మిస్ అయ్యారని చెబుతున్నారు. అదెలాంటే.. తెలంగాణ రాష్ట్రంలో ఆవులు.. బర్రెలు.. ఎడ్లు కలిపి 90.4 లక్షలు ఉన్నాయని.. వాటికి గొర్రెలు.. మేకల్ని కలిపితే 1.75కోట్లు అవుతాయని చెబుతున్నారు. మరి.. వీటన్నింటికి ఏడాదికి సరిపడా పశుగ్రాసం భారీ ఎత్తున అవసరమవుతుంది. ఇప్పుడున్న విధానంలో పశుగ్రాసానికి కొరత ఏర్పడటం ఖాయమంటున్నారు.
గతంలో వరి పంటను కోసి.. గడ్డిని వాముగా వేసుకొని ఏడాదంతా పశువులకు మేతగా వాడేవారు. ఇప్పుడు వరిని హార్వెస్టర్లతో కయిస్తుండటంతో గడ్డి దొరకటం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రభుత్వం చెప్పినట్లుగా మాత్రమే పంట వేస్తే.. పశుగ్రాసాన్ని సమకూర్చుకోవటం కష్టమవుతుందంటున్నారు. ఒక అంచనా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పశువులకు పశుగ్రాసం నెలకు 82.5లక్షల టన్నులు అవసరమని చెబుతున్నారు. ఇంత పశుగ్రాసం ఉత్పత్తి కావాలంటే కనీసం 5.5 లక్షల ఎకరాలు కేటాయించాలి.
ఈ వర్షాకాలంలో 1.25 లక్షల ఎకరాలకు మాత్రమే పంటలు వేసే ప్రణాళికను సిద్ధం చేసింది. వరి..పత్తి.. కంది..సోయాబీన్.. జొన్న.. పెసలు.. మినుములు.. ఆముదం.. వేరుశనగ.. చెరుకు కలిపి పది పంటలకే భూకేటాయింపులు జరిపింది. ఇతర పంటలకు కేవలం 54,353 ఎకరాల్ని వదిలింది. గత ఏడాది కంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగుకు ప్లాన్ చేసినా.. పశుగ్రాసం.. పసుపు.. మిర్చి సాగు ప్రస్తావన లేకుండా చేసిన ప్లానింగ్ తో రానున్న రోజుల్లో ఇబ్బంది తప్పదంటున్నారు. అన్ని లెక్కలు వేసుకొని ఆచితూచి అన్నట్లు కేసీఆర్.. ఈ కీలకమైన పాయింట్ ను ఎలా మిస్ అయినట్లు?