సీఎం కేసీఆర్ రేంజ్‌కు ఏ మాత్రం సరిపోని రీతిలో తాజా ఆఫర్.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Jun 2020 1:32 PM IST
సీఎం కేసీఆర్ రేంజ్‌కు ఏ మాత్రం సరిపోని రీతిలో తాజా ఆఫర్.?

పాలన పట్టనట్లు ఫాంహౌస్ కే పరిమితమైనట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. మంతనాలు.. అంశాల మీద చర్చతో పాటు.. పాలనాపరమైన మదింపులతో కాలం గడిపే సారూ.. కొన్నిసార్లు జూలు విదిల్చిన సింహం మాదిరి పాలనకు సంబంధించిన అంశాల మీద ప్రత్యేకంగా ఫోకస్ చేస్తారు. వరుస భేటీలు.. అవి కూడా గంటల తరబడి నిర్వహించటం.. పలు కీలక నిర్ణయాలు తీసుకోవటం లాంటివి చేస్తుంటారు. తాజాగా అలాంటి పనే చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టర్లు.. జిల్లా పంచాయితీ అధికారులతో భేటీ అయిన ముఖ్యమంత్రి.. పలు అంశాల మీద చర్చలు జరిపారు. గంటల పాటు సాగిన ఈ భేటీలో ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు కేసీఆర్. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా నకిలీ విత్తనాల జోరు పెరిగిన నేపథ్యంలో.. అలాంటి వారికి ముకుతాడు వేసే ప్రయత్నం చేశారు. నకిలీ విత్తనాల వ్యాపారం చేసే వారిని పోలీసుల సాయంతో పట్టుకోవాలన్నారు.

నకిలీ విత్తనాలతో రైతులు ఆర్థికంగా నష్టపోవటమే కాదు.. తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. కొన్నిసార్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. అలాంటి వ్యాపారులు రైతు హంతకులుగా అభివర్ణించారు. ఇలాంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలన్న కేసీఆర్.. రాష్ట్రంలో నకిలీ విత్తనాల దందా ఆగిపోవాలన్నారు.

నకిలీ విత్తనాలతో పాటు.. కల్తీ విత్తనాల్ని అమ్మే వ్యాపారులకు సంబంధించిన సమాచారాన్ని అందించిన వారికి రూ.5వేలు నజరానా ఇస్తానని ప్రకటించారు. అంతేకాదు.. సమాచారం ఇచ్చిన వారి పేర్లను రహస్యంగా ఉంచుతామని చెప్పారు. ఇదంతా బాగానే ఉన్నా.. రైతు హంతకులని అభివర్ణించిన వారి సమాచారానికి కేవలం రూ.5వేలకు సరిపెడితే బాగుంటుందా? ఇలాంటి వారి సమాచారం వెల్లువలా రావాలంటే.. ఆఫర్ అదిరేలా ఉండాలి. తక్కువలో తక్కువ రూ.50వేల నుంచి రూ.లక్ష మేర ఉండాలి.

అప్పుడు మాత్రమే ప్రభుత్వ నజరానా కోసమైనా.. పెద్ద ఎత్తున వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అయినా.. ఇలాంటి వాటి విషయంలో వినూత్నంగా వ్యవహరించే కేసీఆర్.. తన సహజ ధోరణికి భిన్నంగా ఆచితూచి అన్నట్లు రూ.5వేలు నజరానాను ప్రకటించటం ఏమిటన్న పెదవి విరుపు పలువురి నోట వినిపిస్తోంది. రైతుల ఉసురు తీసే నకిలీ విత్తన వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలంటే.. సారు నోటి నుంచి అదిరే ఆఫర్ రావాలి.

అప్పుడే.. తెలంగాణలో నకిలీ.. కల్తీ విత్తనాలు అమ్మాలంటేనే వణికే పరిస్థితి వచ్చి.. అలాంటి దరిద్రపుగొట్టు వ్యాపారాన్ని చేసేందుకు ఏ మాత్రం ఇష్టపడని వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో చాలా అవసరం. అప్పుడు మాత్రమే రైతుల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుంది. మరి.. అలాంటి పెద్ద టాస్కుకు రూ.5వేలు ఇవ్వటం ఏమిటి కేసీఆర్?

Next Story