సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనలో ఓ చూడముచ్చటైన సంఘటన
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Sept 2020 5:18 PM ISTసీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా ముందుగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని కేసీఆర్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం కేసీఆర్ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే.. రింగ్ రోడ్డు, మినీ ట్యాంక్‌బండ్ పనులను కూడా సీఎం పరిశీలించారు. అయితే.. సీఎం కేసీఆర్ పర్యటనలో ఓ చూడముచ్చటైన సంఘటన చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్ కొండపై నుండి దిగుతూ.. తన కాన్వాయ్‌ను పక్కకు ఆపి కోతులకు అరటి పండ్లు పంచారు. గుంపులు గుంపులుగా వచ్చిన కోతులు ఒక్కో పండును అందుకుని వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదిలావుంటే.. సీఎం కేసీఆర్.. ఐదేళ్ల క్రితం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, విస్తరణ పనులు ప్రారంభించిన నాటి నుంచి యాదాద్రికి రావడం ఇది 13వ సారి. ప్రస్తుతం దేశంలోనే అద్భుత రాతి కట్టడంగా అపురూప శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి.