కశ్మీర్‌ను కంట్రోల్ చేసేది ఆ ఆరుగురేనా?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Aug 2020 1:30 PM ISTదేశంలో దశాబ్దాలుగా సాగే సమస్యల్ని పరిష్కరించే విషయంలోనూ.. వాటిని ఒక కొలిక్కి తేవటంలో కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వాలు ఎంతలా వైఫల్యం చెందాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి భిన్నంగా తన మొదటి టర్మ్ లోనే కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్న ప్రధాని మోడీ.. రెండో దఫా చేతికి అధికారం వచ్చిన నెలల వ్యవధిలోనే సుదీర్ఘకాలంగా సాగుతున్న వివాదాలకు ఒక పరిష్కారం (అందరూ ఆమోదించినా ఆమోదించకున్నా) చెప్పేయటం ద్వారా విషయాల్ని తేల్చేసే పనిలో పడ్డారని చెప్పాలి.
నిజానికి ఇలా చేయటానికి చాలా ధైర్యం ఉండాలి. ఆ విషయంలో తనకు టన్నుల కొద్దీ ఉందన్నట్లుగా ఆయన వ్యవహరించారు. కశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370ను వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేయటం.. కేంద్రపాలిత ప్రాంతంగా మార్చటం ద్వారా.. ఆయా ప్రాంతాల్లోకి ఎవరైనా వెళ్లి స్థిర నివాసం ఏర్పర్చుకోవాలన్న అందుకు అవకాశం కలిగేలా నిర్ణయాలు తీసుకున్నారు.
దీనిపై జమ్ము..లద్దాఖ్ వాసుల్లో ఎలాంటి అభ్యంతరాలు లేకున్నా.. కశ్మీరీల విషయంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. ఎప్పటికప్పుడు తమను తాము ప్రత్యేకంగా భావించుకోవటం కశ్మీరీలకు.. వారికి మద్దతు ఇవ్వటం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకునే పార్టీలకు అలవాటు. అందుకు అవకాశం లేని రీతిలో మోడీ సర్కారు నిర్ణయం తీసుకుందని చెప్పాలి. మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం నేటికి ఏడాదైంది. ఇలాంటివేళ.. కశ్మీర్ మొత్తాన్ని నియంత్రించేది మాత్రం ఆరుగురు కీలక అధికారులేనని చెబుతారు.
ఇంతకీ వారెవరు? వారేం చేస్తారు? కశ్మీర్ లో కేంద్రం అనుకున్నట్లుగా పట్టుబిగించటానికి ఏమేం చేస్తారన్న విషయాల్లోకి వెళితే..
జీసీ ముర్మూ
జమ్మూకశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్. 1985 బ్యాచ్‌కు చెందిన ఈ ఐఏఎస్ అధికారి ప్రధాని మోడీకి సన్నిహితుడు. ఆయన పనితీరు మీద ఎంతో నమ్మకం ఉంది. అందుకే.. ఆయనకు ఈ కీలక భాద్యతను అప్పగించారని చెప్పాలి. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్నప్పుడు ఆయన ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేయటం గమనార్హం.
కేవల్ కుమార్ శర్మ
మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి. కాకుంటే.. జమ్ములోని కఠువా ప్రాంతానికి చెందిన వారు. స్థానిక అంశాల మీద పట్టు ఉండటంతో పాటు.. కమిట్ మెంట్ కు నిలువెత్తు రూపంగా చెబుతారు. ఢిల్లీ, గోవాల్లో చీఫ్ సెక్రటరీగా, చండీగఢ్‌లో ప్రభుత్వ సలహాదారుగా, కేంద్ర మానవ వనరుల కార్యదర్శిగా పనిచేశారు. జమ్మూకశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్ కు సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. కేబినెట్ హోదాలో రెవెన్యూ, ప్రణాళిక, పరిశ్రమలు, విద్య, ఉద్యాన శాఖలను చూస్తున్నారు.
బీవీఆర్ సుబ్రమణ్యం
ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా అక్కడో తెలుగోడు ఉంటారనటానికి చెబుతుంటారు. కశ్మీర్ విషయంలోనూ ఇది నిజమేననిపిస్తుంది. పరీక్షా కాలంలో జమ్ముకశ్మీర్ భవిష్యత్తును డిసైడ్ కీలక బాధ్యతను నిర్వర్తిస్తున్నది ఒక తెలుగువాడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఈయన.. ప్రస్తుతం జమ్ముకశ్మీర్ లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ప్రధాని డ్రీం టీంలోకీలక సభ్యుడిగా ఆయన్ను చెబుతుంటారు. ముక్కుసూటితో పాటు.. నిజాయితీ ఎక్కువ. అన్నింటికంటే ప్రభుత్వానికి విపరీతమైన నమ్మకస్తుడిగా ఆయనకు పేరుంది.
ఫారూఖ్ ఖాన్
వీరు మాజీ ఐపీఎస్ అధికారి. రిటైర్ అయ్యాక బీజేపీలో చేరారు. ప్రస్తుతం లెఫ్టెనెంట్ గవర్నర్ కు సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం శాఖలను పర్యవేక్షిస్తున్నారు.
రాజీవ్ రాయ్ భట్నాగర్
జమ్ముకశ్మీర్ లెప్టెనెంట్ గవర్నర్ కు మూడో సలహాదారుగా వ్యవహరిస్తారు. వీరు ఉత్తరప్రదేశ్ కు చెందిన మాజీ ఐపీఎస్. సీఆర్ఫీఎఫ్ డీజీగా పని చేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ వైద్య ఆరోగ్యం, వైద్య విద్య, ప్రజా పనులు, నీటిపారుదల, రవాణా, పశుసంవర్థక శాఖలను చూస్తున్నారు.
బషీర్ అహ్మద్ ఖాన్
మరో విశ్రాంత ఐఏఎస్ అధికారిగా ఈయన్ను చెప్పుకోవాలి. జమ్ముకశ్మీర్ లెఫ్టెనెంట్ జనరల్ కు నాలుగో సలహాదారుగా ఈ ఏడాది మార్చిలో అపాయింట్ అయ్యారు. వీరు విద్యుత్తు, పట్టణాభివృద్ధి, పంచాయతి రాజ్, విపత్తుల నిర్వహణ, సాంస్కృతిక, పర్యాటక శాఖలను పర్యవేక్షిస్తున్నారు.