కరోనా వ్యాక్సిన్ వాటర్ బాటిల్ ధర కంటే తక్కువకు రానుందా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Aug 2020 7:13 AM GMT
కరోనా వ్యాక్సిన్ వాటర్ బాటిల్ ధర కంటే తక్కువకు రానుందా?

కరోనా మాట వింటేనే హడలిపోతున్నారు సామాన్యులు. ఇక.. ఈ మహమ్మారి ఒంట్లోకి ప్రవేశించిందన్న విషయం తెలిసినంతనే తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారు. ఇదొక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా మహమ్మారికి చెక్ చెప్పాలంటే.. వ్యాక్సిన్ మినహా మరో దారి లేదనే చెప్పాలి. దీని కోసం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున పరీక్షలు జరుపుతున్నారు.

మన దేశం సంగతికే వస్తే.. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థతో పాటు.. బయలాజికల్-ఈ.. ఇండియన్ ఇమ్యునోలాజికల్స్.. ఇలా పలువురు ప్రముఖులు ఒకే వేదిక మీదకు వచ్చి కరోనా వ్యాక్సిన్ మీద జరుగుతున్న పరిశోధనల గురించి తాజా పరిణామాల్ని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.

ఇటీవల కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కరోనా ముప్పు పదేళ్ల పాటు ఉంటుందని.. కరోనాకు చెక్ చెప్పే మందు రాదని చెప్పటంతోపాటు.. ప్రపంచ ప్రజలు భయాందోళనలకు గురయ్యే పలు వ్యాఖ్యలు వినిపించాయి. ఈ నేపథ్యంలో కరోనా ముప్పు ఎంత కాలం ఉంటుంది? వ్యాక్సిన్ ధర ఎంత ఉండే అవకాశం ఉంది లాంటి అంశాల్ని వ్యాక్సిన్ తయారీ మీద పని చేస్తున్న ప్రముఖుల్ని నేరుగా అడగటం.. అందుకు వారు సమాధానాలు ఇవ్వటం ఆసక్తికరమని చెప్పాలి.

కోవిడ్ ముప్పు ఎంతకాలం ఉండే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ ప్రశ్నించగా.. డబ్ల్యూహెచ్ వో ప్రతినిధి డాక్టర్ సౌమ్య స్వామినాథన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాప్తికి చెక్ చెప్పేందుకు ఎక్కువ పరీక్షలు నిర్వహించటం మినహా మరో మార్గం లేదని తేల్చేశారు. ‘‘కళ్లకు గంతలు కట్టుకొని మంటల్ని ఆర్పటం ఎలానో.. పరీక్షలు చేయకుండా కోవిడ్ తో పోరాడటం లాంటిదే’’ అని పేర్కొన్నారు. ఎక్కడైనా కరోనా సోకిన వ్యక్తుల శాతం ఐదు కంటే తక్కువగా ఉంటే.. అక్కడ పరీక్షలు ఎక్కువగా జరగలేదనేనని చెప్పారు. గతంలోనూ సార్స్ లాంటి వ్యాధులు వచ్చాయని.. అయితే అప్పట్లో ధనిక దేశాలకు తొలుత.. పేద దేశాలకు తర్వాత అన్నట్లు వ్యాక్సిన్లు అందించారని.. అందుకు భిన్నంగా ఈసారి మాత్రం ప్రపంచప్రజలందరికి ఒకేసారి వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు.

కరోనాకు వ్యాక్సిన్ తయారీకి ఎంత అవకాశం ఉందో.. ఫెయిల్ కావటానికి అంతే అవకాశం ఉందన్న వ్యాఖ్యతో పాటు.. కోవిడ్ కు వ్యాక్సిన్ సిల్వర్ బుల్లెట్ కాదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ మాటలపై అభిప్రాయం ఏమిటంటే మంత్రి కేటీఆర్ ప్రశ్నిస్తే.. దానికి ఆ సంస్థకు చెందిన డాక్టర్ సౌమ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ లను తయారు చేయటం అంత ఈజీ కాదని.. రిస్కుతో కూడున్నదన్నారు. ఇప్పటికి మలేరియా.. హెచ్ ఐవీ లాంటి వాటికి వ్యాక్సిన్లు లేవన్న విషయాన్ని గుర్తు చేశారు.

కోవిడ్ కు చెక్ పెట్టేలా వ్యాక్సిన్ తయారీ చేస్తామని కచ్ఛితంగా ఎవరూ చెప్పలేరన్న ఆమె.. ఆ ప్రయత్నాలతో పాటు.. కరోనాను నివారించే మందుల్ని కూడా డెవలప్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. కొత్త తరహా డయాగ్నస్టిక్ పరీక్షలు కూడా సిద్ధం చేయాలని.. అప్పుడు మాత్రమే మహమ్మారిని ఎదుర్కొనే వీలుందన్నారు. అదే సమయంలో భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ క్రిష్ణఎల్లా మాట్లాడుతూ.. ఒక వ్యాక్సిన్ తయారీకి కనీసం 14 నుంచి 15 ఏళ్ల సమయం పడుతుందని.. అందుకు భిన్నంగా కోవిడ్ కు పన్నెండు నుంచి పద్దెనిమిదినెలల్లోవ్యాక్సిన్ వృద్ధి చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. సైన్సుకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి షార్ట్ కట్స్ కు అవకాశం ఉండన్న ఆయన.. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో మరింత త్వరగా చేసే అవకాశం ఉంన్నారు.

వ్యాక్సిన్ ధర ఎంత ఉంటుందన్న విషయంపై ఈ ప్రముఖుల స్పందన చూస్తే.. బయలాజికల్ -ఈ ఎండీ మహిమ దాట్ల స్పందిస్తూ.. వ్యాక్సిన్ల తయారీలో మనకు నాలుగు దశాబ్దాల అనుభవం ఉందని.. దాంతోనే కోవిడ్ ను ఎదుర్కోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ సంస్థ ప్రతినిధి డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. దీన్నో రేసుగా తాము భావించట్లేదని.. బాధ్యతగా అనుకుంటున్నట్లు చెప్పారు. దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉంటే.. వారిలో 70 శాతం మందికి వ్యాక్సిన్ అవసరం ఉంటుందని.. అందుకే వ్యాక్సిన్ ధర వెయ్యి అనుకుంటే.. కొన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. అందుకే.. అతి తక్కువ ధరకే వ్యాక్సిన్ అందించాలని తాము అనుకుంటున్నట్లు చెప్పారు. మిగిలిన వారు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. మొత్తంగా ఒక వాటర్ బాటిల్ ధర కంటే తక్కువగా వ్యాక్సిన్ సిద్ధం చేయటం పైనే తాము ఫోకస్ పెట్టిన విషయాన్ని చెప్పారు. వారి మాట నిజమైతే.. అంతకు మించిన సంతోషకరమైన విషయం ఏముంటుంది చెప్పండి.

Next Story