కర్ణాటకను కలవరపెడుతున్న కోవిద్ కేసులు..!
By సుభాష్ Published on 13 July 2020 9:54 AM GMTకర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని పెరుగుతున్న కోవిద్ కేసులు కలవరపెడుతూ ఉన్నాయి. భారత్ లో కరోనా వైరస్ కేసులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఐదో స్థానానికి చేరుకుంది. అనూహ్యంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతూ ఉండడంతో అధికారులు అప్రమత్తమవుతూ ఉన్నారు.
భారత్ లో కరోనా కేసులు అధికంగా ఉన్న టాప్ 10 రాష్ట్రాల్లో కర్ణాటక ఉండడమే కాకుండా.. ఇప్పుడు ఏకంగా ఐదో స్థానానికి ఎగబాకింది. మహారాష్ట్ర, తమిళనాడు,ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల తర్వాత కరోనా వైరస్ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక చేరింది. ఉన్నపళంగా కర్ణాటకలో పెరుగుతున్న కేసుల కారణంగా గుజరాత్ ను కూడా వెనక్కునెట్టే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు. గుజరాత్ రాష్ట్రం కర్ణాటక కంటే 40000 కేసులు అధికంగా ఉంది. కర్ణాటక రాష్ట్రంలో ఆదివారం నాటికి 38,843 కేసులు నమోదయ్యాయి.
బెంగళూరు లోనే కొత్తగా 1525 కేసులు ఆదివారం నాడు నమోదయ్యాయి. శనివారం సాయంత్రం నాటికి కర్ణాటకలో 71 మంది కరోనా కారణంగా మరణించారు. 45 మంది కేవలం బెంగళూరు నగరంలోనే మరణించారు. దీంతో బెంగళూరు అర్బన్, రూరల్ ప్రాంతాల్లో మరోసారి లాక్ డౌన్ ను విధించాలని భావిస్తూ ఉన్నారు. బెంగళూరు అర్బన్, రూరల్ ప్రాంతాల్లో జూన్ 14వ తేదీ నుంచి జూన్ 23వ తేదీ వరకు లాక్ డౌన్ ను అమలుచేయనుంది. 14వ తేదీ రాత్రి 8 గంటలకు లాక్ డౌన్ మొదలై, 23వ తేదీ ఉదయం 5 గంటల వరకు కొనసాగనుందని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. లాక్ డౌన్ రోజుల్లో అత్యవసర సేవలకు మాత్రం అనుమతి ఉంటుందని తెలిపింది. లాక్ డౌన్ సమయంలో ఆసుపత్రులు, సరుకులు, పాలు, కూరగాయలు, మందులు, నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండనున్నాయి.
లాక్ డౌన్ ను అమలు చేస్తూ ఉండడంతో బెంగళూరు ప్రాంత వాసులు గ్రామాలకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో పల్లెల్లో కరోనా వ్యాప్తి జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తూ ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున బెంగళూరు లాక్ డౌన్ గురించి ప్రస్తావిస్తూ వస్తున్నారు. కరోనా వ్యాధిగ్రస్థులు పల్లెలకు చేరుకుంటే లాక్ డౌన్ చేసి కూడా ఉపయోగం లేదని పలువురు భావిస్తూ ఉన్నారు. గ్రామాల్లో కరోనా మహమ్మారి చేరుకుంటే కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ అన్నది జరుగుతుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.