కంగనా రనౌత్ కు 'వై ప్లస్ సెక్యూరిటీ'

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Sept 2020 12:58 PM IST
కంగనా రనౌత్ కు వై ప్లస్ సెక్యూరిటీ

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున తన అభిప్రాయాలను చెబుతున్న సంగతి తెలిసిందే..! ముంబై పోలీసుల తీరు.. అక్కడి రాజకీయ నాయకుల తీరు సరిగా లేదంటూ ఆమె చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తనకు ముంబైని చూస్తుంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లా అనిపిస్తోందని ఆమె తెలిపింది. దీనిపై పెద్ద ఎత్తున ఆమె మీద విమర్శలు వచ్చాయి. ముంబైను మరీ అలా అనడం పట్ల చాలా మంది ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొందరు రాజకీయ నేతలు ఆమెను బహిరంగంగా బెదిరింపులకు పాల్పడ్డారు. కంగనా రనౌత్ కు రక్షణగా 'వై ప్లస్' సెక్యూరిటీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావించింది.

కంగనా రనౌత్ కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ను ఇవ్వడమే కాకుండా 11 మంది పోలీసులు, కమాండోలు కూడా ఉంటారని హోమ్ మినిస్ట్రీ తెలిపిందని మీడియా సంస్థలు చెబుతూ ఉన్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత కంగనా డ్రగ్స్ గురించి చేసిన వ్యాఖ్యలు, పలు అంశాల ప్రస్తావన కారణంగా ఆమెకు ప్రమాదం పొంచి ఉందని ప్రభుత్వం భావిస్తోంది.. అందుకే ఆమెకు వై ప్లస్ సెక్యూరిటీని ఇచ్చారు.

తనకు సెక్యూరిటీ ఇవ్వడంపై హోమ్ మినిస్టర్ అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపింది కంగనా. ఒక దేశ భక్తురాలి నోరును కొన్ని శక్తులు నొక్కివేయకుండా ఆయన సెక్యూరిటీని ఇచ్చారని.. తనను ముంబైకు వెళ్ళమని కూడా చెప్పారని తెలిపింది కంగనా. ఆయన భరతమాత కుమార్తెకు రక్షణ కల్పించారని ఆమె చెప్పుకొచ్చింది.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని కంగనా అసహనం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది. మంబై పోలీసులపై నమ్మకం లేకుంటే ఇక్కడకు రావొద్దని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ కంగనాకు కౌంటర్‌ ఇచ్చారు. ఎంపీ సంజయ్‌ బహిరంగంగా తనకు వార్నింగ్‌ ఇస్తున్నారని, ఇప్పడు తనకు ముంబై పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లా కనిపిస్తోందని కంగనా కామెంట్‌ చేయడంతో వివాదం ముదిరింది.

ముంబై మహా నగరంలో బతకలేకపోతున్నామని చెప్పిన ఆమిర్‌ ఖాన్‌, నసీరుద్దీన్‌ షాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కంగనా ప్రశ్నించింది. ఒక మహిళను అయినందునే శివసేన ఎంపీ రెచ్చిపోతున్నారని తెలిపింది కంగనా. సెప్టెంబర్‌ 9 న ముంబై వస్తున్నానని, దమ్ముంటే తనను అడ్డుకోవాలని ఆమె పలువురికి సవాల్‌ విసిరింది. ప్రస్తుతం ఆమె సిమ్లాలోని తన సొంతింట్లో ఉన్నారు.

Next Story