కంగనా వర్సెస్ శివసేన.. ఆమె ముంబై ఆఫీసుపై దాడులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Sept 2020 5:56 PM IST
కంగనా వర్సెస్ శివసేన.. ఆమె ముంబై ఆఫీసుపై దాడులు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారంపై కంగనా రనౌత్ మొదటి నుండి తన వాయిస్ ను పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఆమె కొందరు శివసేన నాయకుల మీద బహిరంగంగా విమర్శలు చేశారు. తాజాగా ముంబై లోని కంగనా రనౌత్ కార్యాలయంపై మున్సిపల్ అధికారులు దాడులు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఈ విషయంపై కంగనా తన ట్విట్టర్ ఖాతాలో కీలక వ్యాఖ్యలు చేసింది. నా ఆఫీసులోకి ఈరోజు బలవంతంగా మున్సిపల్ అధికారులు చొరబడ్డారు.. భవిష్యత్తులో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తారేమో అని ఆమె ఆరోపణలు గుప్పించారు. 'బీఎంసీ అధికారులు నా ఆఫీసులోకి బలవంతంగా చొరబడ్డారు. కొలిచి చూడడమే కాకుండా.. పొరుగున ఉన్న వారిని కూడా టార్చర్ పెట్టారు. ఆ మేడమ్ చేసిన పనికి మీరంతా అనుభవిస్తారని' వారిని బెదిరించినట్లు కంగనా ట్వీట్ చేసింది. అన్ని పేపర్లు ఉన్నాయి.. బీఎంసీ అనుమతులు కూడా ఉన్నాయి.. ఒక్క ఇల్లీగల్ విషయం కూడా లేదు.. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, స్ట్రక్చర్ ప్లాన్ కూడా తీసుకురాకుండా అధికారులు ఈరోజు తన కార్యాలయానికి వచ్చారని తెలిపింది.

శివసేన, కంగనాకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముంబైలో అడుగుపెట్టొందంటూ శివసేన నేతలు ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. ఆమెకు వై కేటగిరీ భద్రతను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేటగిరీ కింద ఆమెకు ఒక పర్సనల్ సెక్యూరిటీ అధికారితో పాటు మరో 10 మంది పోలీసులు భద్రత కల్పిస్తారు. వీరిలో కమెండోలు కూడా ఉంటారు. తనకు భద్రతను కల్పించిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కంగన ధన్యవాదాలు తెలిపింది.

శివ సేన ఎంపీ సంజయ్ రౌత్ ను సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శిస్తోంది. సంజయ్ రౌత్‌ పురుష అహంకారి అని ఆమె విమర్శించింది. భారతీయ మహిళలపై అఘాయిత్యాలు జరగడానికి ఇలాంటి పురుష అహంకారమే కార‌ణ‌మ‌ని ఆరోపించింది. గతంలో ముంబైలో బతకలేకపోతున్నామని ఆమిర్‌ ఖాన్‌, నసీరుద్దీన్ షా అన్నార‌ని, మ‌రి వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కంగనా నిలదీసింది. తాను ఒక మహిళను అయినందునే సంజ‌య్ రౌత్ రెచ్చిపోయి మాట్లాడుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

హిందూ మతానికి చెందిన ప్రముఖులు ఛత్రపతి శివాజీ, గ్రేట్ మహారాణా ప్రతాప్ ల సిద్ధాంతాలను శివసేన పాటిస్తుందని చెప్పారు. మహిళలను గౌరవించాలనే విషయాన్ని వారు తమకు నేర్పించారని తెలిపారు. మహిళల పట్ల శివసేన దారుణంగా వ్యవహరిస్తోందని కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని సంజయ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమపై ఆరోపణలు చేస్తున్నవారంతా ముంబైని, ముంబాదేవిని కించపరిచేలా మాట్లాడారని అన్నారు. మహిళల గౌరవం కోసం శివసేన ఎప్పుడూ పోరాడుతుందని అన్నారు.

Next Story