అప్పుడు నోట్ల రద్దుతో తప్పు చేశారు.. ఇప్పుడు ఇలా మరో తప్పు: కమల్ హాసన్
By అంజి Published on 7 April 2020 2:18 PM ISTభారత ప్రధాని నరేంద్ర మోదీపై నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ స్థాపకుడు కమల్ హాసన్ తీవ్ర విమర్శలు చేశారు. నరేంద్ర మోదీ నోట్ల రద్దు చేసి ఎంత తప్పు చేశారో.. ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తున్నారంటూ బహిరంగ లేఖ రాశారు కమల్ హాసన్. కోవిద్-19 మొదటి కేసు నమోదైన చాలా సమయానికి కానీ భారత ప్రధాని మేల్కోలేదని తీవ్ర విమర్శలు చేశారు. 21 రోజుల లాక్ డౌన్ కూడా విఫలమయ్యిందని కమల్ హాసన్ అన్నారు. ప్రణాళికాబద్దంగా లాక్ డౌన్ ప్రకటించకపోవడంతో సాధారణ ప్రజలను తప్పుపట్టలేమన్నారు. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రణాళిక, కసరత్తు లేకుండా ఇచ్చిన లాక్ డౌన్ ప్రకటన.. నోట్ల రద్దు మాదిరిగానే విఫలమైందని అన్నారు.
మోదీకి ఓపెన్ లెటర్ రాసిన కమల్ హాసన్.. నోట్ల రద్దు అన్నది పేద ప్రజలపై ఎటువంటి ప్రభావం చూపిందో.. ప్రస్తుత లాక్ డౌన్ కూడా అలంటి ప్రభావమే చూపిస్తోందని అన్నారు. ఇది అంతకు మించిన ఫెయిల్యూర్ గా మిగిలే అవకాశం ఉందని అన్నారు కమల్. నోట్ల రద్దు కారణంగా పేదలంతా పొదుపు చేసుకున్న డబ్బులు కోల్పోయారు.. ఇప్పుడు పొదుపు చేసిన డబ్బుతో పాటూ ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉందని భయపడుతున్నానన్నారు కమల్. 140 కోట్ల మంది ప్రజలను కేవలం 4 గంటల వ్యవధిలో లాక్ డౌన్ కు సిద్ధం కావాలని పిలుపు ఇచ్చారని.. నాలుగు నెలల ముందే కరోనా వైరస్ సమాచారం ఉన్నా 4 గంటల నోటీసుతోనే ప్రజలకు లాక్ డౌన్ ఉత్తర్వులు జారీ చేయడం పెద్ద తప్పిదమని అన్నారు. నోట్ల రద్దు లాగే మరో తప్పిదం జరుగుతుందేమోనన్న భయం తనను వెంటాడుతోందన్నారు. భారత్ లో జనవరి 30న మొదటి కేసు నమోదైతే.. మేల్కోడానికి ఇంత సమయం పట్టిందా అని ప్రశ్నించారు. మోదీ పిలుపునిచ్చిన దీపాల కాన్సెప్ట్ పై కూడా కమల్ విమర్శలు గుప్పించారు. ప్రజలందరినీ దీపాలు వెలిగించమని మీరు కోరారు.. కానీ రొట్టెలను కాల్చుకోడానికి ఆయిల్ కూడా లేని కుటుంబాలు ఉన్నాయని ఆయన అన్నారు.
ప్రజలను గందరగోళంలో పడేయకూడదు..
జాతిని ఉద్దేశించి మోదీ రెండు సార్లు మాట్లాడటం కచ్చితంగా అవసరమేనని.. కానీ, దాని కన్నా ముఖ్యమైన పని పేదలను ఆదుకోవాలని అన్నారు. 140 కోట్ల భారతీయులు మీ దిశానిర్దేశాన్ని పాటిస్తున్నారు. మీరు ఏం చెబితే వారు అది చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో మన కోసం నిస్వార్థంగా, అలుపెరగకుండా పనిచేస్తోన్న వైద్య సిబ్బందికి మద్దతుగా మీరు ఇచ్చిన పిలుపునకు మీ ప్రత్యర్థులు కూడా చప్పట్లు కొట్టారు. మేం మీ విన్నపాలను, ఆదేశాలను పాటిస్తామనీ.. ఈ నిర్ణయాలు ప్రజలను గందరగోళంలో పడేయకూడదని అన్నారు. ఎగువ మధ్యతరగతి, సంపన్న వర్గాల కోసం కాకుండా పేద ప్రజల సమస్యలను పట్టించుకోవాలని అన్నారు.
మీ నిర్ణయాలు ఎక్కువుగా ధనికులు, మిడిల్ క్లాస్‌ను సంతోష పెట్టె విధంగానే ఉన్నాయి. కానీ ఈ కష్టకాలంలో పేదవాని సమస్యలు కూడా అర్థం చేసుకోవాలన్నారు. మన జిడిపిలో గానీ.. దేశ నిర్మాణంలో గానీ వారు చేస్తోన్న సహకారాన్ని విస్మరించలేమన్నారు. దేశంలో మెజారిటీ వాటా వారిదే. పునాదులు దెబ్బతింటే అద్భుతమైన నిర్మాణాలు కూడా నేల మట్టం అవుతాయని హెచ్చరించారు.