కవిత రీఎంట్రీ.. తెలంగాణలో మరో ఉద్యమం?

By Medi Samrat  Published on  25 Jun 2020 9:17 AM GMT
కవిత రీఎంట్రీ.. తెలంగాణలో మరో ఉద్యమం?

కొన్ని విషయాల్ని చూసినప్పుడు భలే ఆశ్చర్యంగానూ.. ఆసక్తికరంగా అనిపిస్తుంటాయి. సుదీర్ఘ ఉద్యమం తర్వాత ఏదైనా సాధించినప్పుడు.. అక్కడ భావస్వేచ్ఛ అద్భుతంగా ఉంటుందని భావిస్తారు ఎవరైనా. ఎందుకంటే.. ఇప్పుడున్న కాలంలో ఉద్యమాలు నిర్మించటం.. దాన్ని శాంతియుతంగా సాగేలా చేయటం.. అంతిమంగా అనుకున్నది చేయటం మామూలు విషయం కాదు. వ్యవస్థలన్నీ ప్రజాస్వామ్య పద్దతిలో వ్యవహరించినప్పుడు మాత్రమే ప్రజా ఉద్యమాలు నిలబడే అవకాశం ఉంది.

అందుకు భిన్నంగా ప్రజా ఉద్యమాలతో అధికారంలోకి వచ్చిన వారు.. తర్వాతి రోజుల్లో ఎలాంటి పద్దతుల్ని అనుసరిస్తారో చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. పొరుగున ఉన్న నేపాల్ లో ప్రచండది చక్కటి ఉదాహరణ. అంతదాకా ఎందుకు ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో.. ఉద్యమాలకు కాలం చెల్లటం చూస్తున్నదే. చివరకు నిరసనలు.. ఆందోళనలు చేపట్టే ధర్నా చౌక్ లాంటివి సైతం ఎత్తేసే పరిస్థితి ఉద్యమాల పురిటిగడ్డలోనే రావటాన్ని చాలామంది జీర్ణించుకోలేని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయురాలన్న భావన ప్రజల్లో కల్పించలేకపోయిన కవిత.. కొత్త అవతారానికి తెర తీశారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి బలం చేకూరుస్తూ ఆమె పొలిటికల్ ప్లానింగ్ రివీలైంది. లోక్ సభ ఎన్నికల్లో ఓటమిపాలైన ఆమె.. ఇటీవల ఎమ్మెల్సీగా చేసేందుకు తండ్రి కమ్ పార్టీ అధినేత డిసైడ్ చేయటంతో.. ఆమె పరిస్థితి కాస్త గాటున పడినట్లుగా చెప్పాలి. అయితే.. తన వరకు తాను సరికొత్త ఇమేజ్ ను సొంతం చేసుకోవటానికి వీలుగా.. తన తండ్రి ఉద్యమ పంథాకు వారసురాలిగా మారాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగే ఉద్యమానికి ఆమె నడుం బిగించారు. కేంద్రం తీరుపై నిరసనలు.. ఆందోళనలతో ఉద్యమాన్ని నిర్మించాలని భావిస్తున్నారు. ఎవరో ఉద్యమం చేస్తే ఒప్పుకునేందుకు సిద్ధంగా ఉండని కేసీఆర్.. తన కుమార్తె ఉద్యమ గోదాలో దిగితే కాదనే అవకాశం ఉండదు. అధికార పార్టీ ఎమ్మెల్సీ చేసే ఉద్యమం కావటంతో ఆమె చేసే ప్రయత్నాలు ప్రభావవంతంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఇదే విషయం మీద జాతీయ కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్న వేళ.. జాతీయస్థాయి రాజకీయాల్లోచక్రం తిప్పేందుకు ఇదో అవకాశంగా మారుతుందని చెప్పాలి. మొత్తంగా చూసినప్పుడు తన రీఎంట్రీతో ఇమేజ్ ను మొత్తంగా మార్చుకోవటమే కాదు.. జాతీయ స్థాయిలో పార్టీకి కొత్త ముఖంగా నిలవాలన్న ప్రయత్నంలో కవిత ఎంతమేర సక్సెస్ అవుతారో చూడాలి.

Next Story