హైదరాబాద్‌లో ఎటువంటి కబ్జాను చూసినా ఈ నెంబర్ కు ఫోన్ చేయండి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 July 2020 9:34 AM GMT
హైదరాబాద్‌లో ఎటువంటి కబ్జాను చూసినా ఈ నెంబర్ కు ఫోన్ చేయండి..!

హైదరాబాద్ మహానగరం కబ్జా కోరల్లో ఎప్పటి నుండో చిక్కుకుంది. ఛోటా-బడా నాయకుల నుండి ఎంతో మంది కబ్జాలకు పాల్పడి భూమిని తమ సొంతం చేసుకున్నారు. ఒకరి ప్రాపర్టీ తమదని చెబుతూ కాగితాలను సృష్టించడం, ఆ ప్రాంతంలో బోర్డు పాతడం ఎప్పటి నుండో జరుగుతోంది. ప్రభుత్వ భూములను, చెరువులను కూడా సొంతం చేసేసుకున్నారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ఎన్నో చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయన్నది బహిరంగ రహస్యమే.. అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నా.. ఈ కబ్జాలను ఆపలేకపోతున్నారు.

ఇకపై ఎటువంటి ప్రభుత్వ భూమిని కానీ, చెరువులను కానీ ఎవరైనా కబ్జా చేస్తున్నట్లు అనిపిస్తే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి చెప్పొచ్చని అధికారులు చెప్పుకొచ్చారు. 1800-599-0099 నెంబర్ కు ఫోన్ చేసి ఇకపై కబ్జా గురవుతున్న ప్రాంతం గురించి సమాచారం ఇవ్వచ్చని కోరారు.

తెలంగాణ మున్సిపల్ మినిస్టర్ కె.టి.రామారావు ఆదివారం నాడు టోల్-ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. కబ్జాల గురించి అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎటువంటి కబ్జాలు జరగకుండా ఉండాలని ప్రొటెక్షన్ సెల్ ను ఏర్పాటు చేశామన్నారు.

టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయడం ద్వారా డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం కంప్లైంట్ ను రిజిస్టర్ చేసుకుంటుంది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ వర్కింగ్ డేస్ లో ఫిర్యాదులను స్వీకరిస్తుంది. పార్కులు, చెరువులు, ఓపెన్ స్పేస్ ప్రొటెక్షన్ సెల్ కు సమాచారం అందుతుంది.

జిహెచ్ఎంసి పరిధిలో 190 నీటి కుంటలు, చెరువులు ఉన్నాయి. 100కు పైగా పెద్ద, చిన్న పార్కులు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన సమగ్ర సమాచారం అధికారులు సేకరిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కబ్జాలకు గురవ్వకుండా అధికారులు చర్యలు తీసుకుంటూ మొదలుపెట్టారు. ఎంతో మంది మంచి వ్యక్తులు కబ్జాలకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తూ ఉంటారని, అలాంటి వారందరూ ఇకపై సమాచారం ఇచ్చేందుకు వీలుగా ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేశామని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ తెలిపారు.

ఇందుకోసం ఇద్దరు ఆపరేటర్లను తీసుకున్నామని, కాల్స్ సంఖ్య పెరిగే క్రమంలో మరింత మందిని నియమిస్తామని తెలిపారు. ఫిర్యాదులు చేసే వారు తమ పేర్లను చెప్పొచ్చు లేదా గోప్యంగా ఉంచవచ్చని అన్నారు. ఫిర్యాదులు అందగానే సదరు ప్రాంతానికి చెందిన ఆఫీసర్లు ఫీల్డ్ విజిట్ చేస్తారని, కబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చెరువులు, నీటి కుంటలకు సంబంధించిన సమాచారం నీటి పారుదల విభాగం దగ్గర ఉండగా.. పార్కులు, ఓపెన్ స్పేస్ సమాచారం జిహెచ్ఎంసి దగ్గర ఉంది.

కబ్జా దారులపై సమాచారం ఇవ్వడానికి మరింత మంది ముందుకు రావాలని అధికారులు ఆశిస్తూ ఉన్నారు. ఇకపై హైదరాబాద్ లో కబ్జా అన్న పదం వినిపించకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. రాబోయే రోజుల్లో ఎంతమంది బాధ్యత గల పౌరులు ఫోన్ లు చేసి కబ్జాల గురించి సమాచారం ఇస్తారో చూద్దాం.

Next Story