పెళ్ళిసందడి మళ్ళీ మొదలవ్వబోతుందట‌.. ప్ర‌క‌టించిన దర్శకేంద్రుడు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Oct 2020 1:52 PM GMT
పెళ్ళిసందడి మళ్ళీ మొదలవ్వబోతుందట‌.. ప్ర‌క‌టించిన దర్శకేంద్రుడు

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1996వ సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 12న రిలీజైన‌ పెళ్ళిసందడి సినిమా అప్ప‌ట్లో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీకాంత్ హీరోగా, దీప్తి భట్నాగర్, రవళి హీరోయిన్లుగా న‌టించారు. స్వ‌ర‌వాణి కీరవాణి స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు కూడా మంచి ఆదరణ పొందాయి.

అయితే.. టాలీవుడ్ లో నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ స‌త్తా చాటిన‌ సీనియర్ హీరోలందరితో సినిమాలు తీశారు రాఘవేంద్రరావు. ఈ జనరేషన్ హీరోలతో కూడా కొన్ని సినిమాలు రూపొందించారు. ఈ మధ్య కాస్త విరామం తీసుకున్న దర్శకేంద్రుడు మళ్లీ మెగాఫోన్ పట్టబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు.'పెళ్లిసందడి' మళ్ళీ మొదలవ్వబోతుంది.. తారాగణం త్వరలో.. అని ట్వీట్ చేశారు రాఘవేంద్రరావు. దీనికి ఓ వీడియోను కూడా జ‌త‌చేశాడు. ఈ వీడియోలో ఈ కొత్త పెళ్లిసంద‌డికి సంబంధించి సాంకేతిక విభాగాన్ని ప్ర‌క‌టించారు. దీనికి ద‌ర్శ‌కేంద్రుడి ఆస్థాన సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూర్చుతుండ‌గా.. శివశక్తి దత్తా - చంద్రబోస్ లు సాహిత్యాన్ని అందించనున్నారు. ఈ చిత్రాన్ని ఆర్.కె. ఫిలింస్ మరియు ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్స్ పై మాధవి కోవెలమూడి - శోభు యార్లగడ్డ - ప్రసాద్ దేవినేని కలిసి నిర్మించనున్నారు. త్వరలోనే నటీనటుల వివరాలు తెలియజేస్తామని వీడియోలో ప్రకటించారు.

అయితే.. ఈ పెళ్లిసంద‌డి చిత్రంలో శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరోగా న‌టిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ సినిమా ద్వారా రోష‌న్‌కి లైఫ్ ఇవ్వాల‌ని చూస్తున్న‌ట్లు.. అతి త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రానున్న‌ట్లు గుస‌గులు విన‌ప‌డుతున్నాయి. కాగా, శ్రీకాంత్ తనయుడు రోషన్.. నాగార్జున నిర్మించిన 'నిర్మలా కాన్వెంట్' చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు.

Next Story