ఢిల్లీ: కాంగ్రెస్‌ మాజీ నేత జ్యోతిరాధిత్య సింధియా భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కమలం పార్టీలో చేరారు. తీవ్ర ఉత్కంఠ పరిణామాల మధ్య మంగళవారం నాడు జ్యోతిరాధిత్య కాంగ్రెస్‌ను వీడిన విషయం తెలిసిందే. కాగా ఇవాళ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకొన్నారు. నిన్నటి నుంచి జ్యోతిరాధిత్య బీజేపీలో చేరతారంటూ వచ్చిన వార్తలు ఎట్టకేలకు నిజమయ్యాయి.

ఇవాళ మధ్యాహ్నం జ్యోతిరాధిత్య బీజేపీ కార్యాలయం చేరుకున్నారు. ఆ తర్వాత కాసేపు బీజేపీ నేతలతో చర్చలు జరిపారు. అనంతరం జేపీ నడ్డా.. బీజేపీ కండువా కప్పి ప్రాథమిక సభ్యత్వ రసీదును అందించారు. కాగా కాంగ్రెస్‌లో తన 18 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు పలికారు.

ఇదిలా ఉంటే.. బెంగళూరు రిసార్ట్‌లో ఉన్న సింధియా అనుకూల ఎమ్మెల్యేలు 22 మంది తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇందులో ఆరుగురు మంత్రులు ఉండడం గమనార్హం.

ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం తలెత్తింది. కాంగ్రెస్‌ పార్టీని వీడి జ్యోతిరాధిత్య సింధియా బీజేపీలో చేరారు. ఆయనకు బీజేపీ రాజ్యసభ సీటు ఇచ్చి కేంద్ర కేబినెట్‌లోకి తీసుకురావాలని బీజేపీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

బీజేపీలో చేరడం ఆనందంగా ఉందని సింధియా అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, అమిత్‌ షాకు, నడ్డాకే సింధియా ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్‌లో యువ నేతలకు అన్యాయం జరుగుతోందని, మధ్య ప్రదేశ్‌లో పాలన స్తంభించిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి మేలు జరగడం లేదని అందుకే బీజేపీలో చేరానన్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.