కూతుళ్ల ముందే జర్నలిస్టును తుపాకీతో కాల్చిన దుండగులు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 July 2020 6:04 AM GMT
కూతుళ్ల ముందే జర్నలిస్టును తుపాకీతో కాల్చిన దుండగులు..!

ఘజియాబాద్: జర్నలిస్టును కూతుళ్ల ముందే కాల్చిన ఘటన ఘజియాబాద్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సిసిటివి కెమెరాల్లో రికార్డు అయ్యాయి. జర్నలిస్ట్ విక్రమ్ జోషి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి వెళుతుండగా కొందరు అడ్డుగా వచ్చారు. తమ దగ్గర ఉన్న తుపాకీతో విక్రమ్ జోషి మీద కాల్పులు జరిపారు. ఈ ఘటనలో విక్రమ్ జోషి తలపై తూటా దూసుకువెళ్లింది. అతన్ని హుటాహుటిన నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

మొత్తం అయిదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విక్రమ్ జోషి మీద కాల్పులు జరిగిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. అతడి మీద దాడి చేసిన వ్యక్తులు విక్రమ్ జోషి కుటుంబానికి తెలిసిన వారేనని పోలీసులు తెలిపారు.

ఘజియాబాద్ లోని విజయ్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడి సిసిటివి కెమెరాల్లో ఈ ఘటన రికార్డు అయ్యింది. జోషి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి వెళుతుండగా బండి అదుపు తప్పి పడిపోయింది. వెంటనే కొందరు అతడి మీద పడి దాడి చేయడం మొదలుపెట్టారు. అతడి ఇద్దరు కుమార్తెలు బైక్ కింద పడిపోగానే పారిపోవడం సిసిటివి కెమెరాలో రికార్డు అయ్యింది. ఓ కారు దగ్గరకు అతన్ని లాక్కుని వెళ్లి.. కొద్ది సేపు కొట్టిన అనంతరం అక్కడి నుండి వెళ్లిపోయారు.

విక్రమ్ జోషి రోడ్డు మీద పడి ఉండగా.. పెద్ద కుమార్తె అతడి దగ్గరకు వచ్చింది. ఎవరైనా సహాయం చేయండి అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. రోడ్డు మీదనే తన తండ్రి పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరైనా సహాయం చేస్తారేమోనని ఎదురుచూడడం మొదలుపెట్టింది. ఇంతలో కొందరు వచ్చి అతడిని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళడానికి సహాయం చేశారు. ఈ ఘటన రాత్రి 10:30 సమయంలో చోటుచేసుకుంది.

ఇటీవలే విక్రమ్ జోషి తన మేనకోడలిని కొందరు ఆకతాయిలు వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకునే విక్రమ్ జోషి మీద దాడికి పాల్పడి ఉంటారని భావిస్తూ ఉన్నారు.

Next Story
Share it