ఓలా తన ఉద్యోగులకు షాకివ్వబోతోంది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం, ఓలా తన సాఫ్ట్‌వేర్ టీమ్ నుండి దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగించాలని భావిస్తోందని తెలుస్తోంది. ముఖ్యంగా ఓలా యాప్‌కు సంబంధించిన అంశాలలో పనిచేస్తున్న వారిని Ola యాజమాన్యం పక్కన పెట్టాలని భావిస్తోంది. ఓలా సంస్థ ఇటీవల ప్రకటించిన ఎలక్ట్రిక్ స్కూటర్ Ola S1 ప్రో అమ్మకాలు క్షీణించిన తర్వాత ఈ చర్యలు తీసుకుంటూ ఉన్నారు.
ఓలా సాఫ్ట్‌వేర్ టీమ్‌ల నుండి దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోందని CNBC-TV18కి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ Ola S1 ప్రో స్కూటర్ అమ్మకాలు పడిపోతున్న నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపుకు సంబంధించిన వార్తలు వచ్చాయి. ఎంత మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోందనే విషయాన్ని ఓలా నిర్దిష్టంగా ఏమీ వెల్లడించలేదు.
ఎంత మంది సిబ్బందిని బయటకు పంపుతారనేదానిపై స్పందించటానికి ఓలా ప్రతినిధి నిరాకరించారు. దేశంలోని అతిపెద్ద EV కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కాకుండా ఇతర రంగాలపై తన దృష్టిని పెంచుతుందని కంపెనీ తన ప్రకటనలో తెలిపింది. వాహనాలు, సెల్‌లు, బ్యాటరీలు, తయారీ, ఆటోమేషన్, అటానమస్ ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లలో R&D సామర్థ్యం, ఇంజనీరింగ్‌ను నిర్మించడంపై దృష్టి సారిస్తోందని ఓలా ప్రతినిధులు తెలిపారు. ఇక ఇటీవలే ప్రీ-ఓన్డ్ కార్ల వ్యాపారం ఓలా కార్లు, ఓలా డాష్‌ను మూసివేయడం వల్ల ఓలా ఇటీవల దాదాపు 2,000 మంది ఉద్యోగులను తొలగించింది.