నిరుద్యోగ తీవ్రత.. స్వీపర్ జాబ్‌కు 46 వేల మంది గ్రాడ్యుయేట్లు దరఖాస్తు
హర్యానా కౌశల్ రోజ్‌గార్ నిగమ్ (Haryana Kaushal Rozgar Nigam) కింద సఫాయి కర్మచారి పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ముగిసింది
By Medi Samrat Published on 5 Sept 2024 3:14 PM ISTహర్యానా కౌశల్ రోజ్‌గార్ నిగమ్ (Haryana Kaushal Rozgar Nigam) కింద సఫాయి కర్మచారి పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ఈ రిక్రూట్‌మెంట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన జరుగుతుంది. గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి షాకింగ్ ఫిగర్ బయటపడింది. 46 వేల మందికి పైగా గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఈ రిక్రూట్‌మెంట్ కోసం 6,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 40,000 మంది గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకున్నారు. అదనంగా 12వ తరగతి ఉత్తీర్ణులైన 1.2 లక్షల మంది అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. హర్యానా కౌశల్ రోజ్‌గార్ నిగమ్ (HKRN) కింద 5,000 పారిశుద్ధ్య కార్మికుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15,000 జీతం లభిస్తుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు బహిరంగ ప్రదేశాలు, రోడ్లు, భవనాలు, చెత్తను శుభ్రం చేసే పనిని అప్పగిస్తారు.
అభ్యర్థుల అపాయింట్‌మెంట్ వారి సొంత జిల్లాలోనే జరగడం విశేషం. హర్యానా కౌశల్ రోజ్‌గార్ నిగమ్ ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 6 ఆగస్టు 2024 నుండి ప్రారంభమై 22 ఆగస్టు 2024న ముగిసింది. ఈ రిక్రూట్‌మెంట్ కు అభ్యర్థుల వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
పలు సర్వేలు విడుదల చేసిన డేటా ప్రకారం.. నిరుద్యోగ రేటు డేటా హర్యానాలో అత్యధికంగా ఉంది. ఇక్కడ 37.4 శాతం నిరుద్యోగ రేటు ఉంది. దీని తర్వాత.. రాజస్థాన్‌లో 28.5 శాతం, ఢిల్లీలో 20.8 శాతం, బీహార్‌లో 19.1 శాతం, జార్ఖండ్‌లో 18 శాతం నిరుద్యోగ రేటు ఉంది.