ఉద్యోగం కరోనార్పణం.. అద్దెకు అమ్మతనం
By Medi Samrat Published on 21 July 2020 10:03 AM ISTకరోనా తెస్తున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ విలయం ప్రజల్ని దేశ ఆర్థిక స్వరూపాన్ని, సామాజిక వ్యవస్థని అన్నింటినీ చిన్నాభిన్నం చేసేస్తోంది. మాయదారి వైరస్ దాపురించిన దరిమిలా ప్రపంచానికి కంటి నిండా కునుకు కరవైంది. వృద్ధులు ఎక్కడ తమ ప్రాణం హరీ మంటుందోనని గడప దాటడం లేదు. వయసులో ఉన్నవారికేం సుఖం లేదు. ఈ కరోనా కరాళనృత్య నేపథ్యంలో తమ కొలువులు పోగొట్టుకుని వారు దిక్కు తోచక దక్కిన పనిని చేసుకుంటున్నారు. ఉద్యోగం దినదిన గండంలా మారింది. ఇప్పటిదాకా ఉద్యోగాన్ని నమ్ముకుని చేసిన అప్పులు పీకలపై రావడంతో బిక్కచచ్చిపోతున్నారు. ఈ విషమ పరిస్థితి యువతులకు మరింత దారుణంగా పరిణమించింది. ఇక చేసేది లేక నగరంలో యువ మహిళలు ఇన్‌ఫర్టిలిటీ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి సరగోసిగా మారడానికి.. తమ గర్భాలను అద్దెకివ్వడానికి కొందరు మొగ్గు చూపుతుంటే, మరి కొందరు తమ అండాలను అమ్మకానికి పెట్టడానికి వెనకాడటం లేదు. ఈ విషయమై టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం..
నగరంలో ఉద్యోగాలు కోల్పోయిన యువతులు ప్రత్యమ్నాయ మార్గాలు తీవ్రంగా అన్వేషిస్తున్నారు. యువ మహిళల్ని (25-35 వయసు వారు) కాసింత కదిపితే చాలు తమ కష్టాలను ఏకరువు పెడుతున్నారు. ఉద్యోగాలను నమ్ముకుని ఆర్థిక ప్రణాళికలు ఎన్నో వేసుకున్నాం. భవిష్యత్తు బాగుండాలని లోన్లపై ఆస్తులు చేసుకునేందుకు ప్రయత్నించాం.. ఉన్న ఉద్యోగం కరోనార్పణం కావడంతో గత్యంతరం లేక ఇన్‌ఫర్టిలిటీ కేంద్రాల వైపు వెళుతున్నారు. చాలా మంది సరగోసి, ఎగ్ డోనార్ లుగా మారడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. బైట అప్పులు, భయపెడుతున్న బ్యాంకు ఈఎంఐలు ఇంట్లో పరాధీనంగా ఉంటున్న తల్లిదండ్రులు.. మరి ఏం చేయాలి మరో దారి కనిపించేదాకా ఈ దారి చూసుకుంటున్నాం. పిల్లలు లేనివారికి ఆలోటు తీర్చే పని చేస్తున్నాం కూడా. ఇది కూడా తాత్కాలికమే అంటున్నారు.
సరగోసి తల్లికి సగటున రూ.5 లక్షలు అందుతాయి. అదే ఎగ్ డోనార్ లకు రూ.75వేల నుంచి రూ. లక్షదాకా వచ్చే అవకాశముంది. సరగోసీలకు ఆహారం, మందుల ఖర్చులు ఒప్పందం కుదుర్చుకున్న దంపతులే భరిస్తారు. ఈ సొమ్ము కనీసం వచ్చే సంవత్సరం దాకా మమ్మల్ని ఆదుకుంటుందని పాతికేళ్ల మీరా అంటోంది. మీరా గత సంవత్సరం నగరంలోని ఓ ప్రముఖ హోటల్ లో ఉద్యోగం చేయడానికి వచ్చింది. లాక్ డౌన్ ప్రకటించగానే యాజమాన్యం బైటికి పంపించేసింది. రూ.45వేల జీతం రాత్రికి రాత్రే వేలల్లో కోతకు గురైంది. మళ్లీ ఉద్యోగానికి పిలుస్తారో లేదో చెప్పలేని దుస్థితి మీరాది.. ఏం చేయాలో తోచని స్థితిలో ఓ స్నేహితురాలి సూచన మేరకు సరగోసి సరైన పరిష్కారమనిపించింది. బ్యాంకులు ఈఎంఐలు కట్టాల్సిందిగా ఒత్తడి తెస్తున్నాయి. నార్త్ ఇండియాలో ఉంటున్న నా కుటుంబం నాపైనే ఆధారపడి ఉంది. ఈ సమయంలో నాకు దొరికిన ఏ చిన్నపాటి అవకాశాన్నైనా వాడుకుంటాను. ఇందులో సిగ్గుపడాల్సిందేమీ లేదు. పైగా ఇందులో అవినీతి అక్రమం ఏదీ లేదు అంటూ నిర్భావంగా చెప్పింది. కానీ తాను సరొగేట్ గా మారుతున్న విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదని తెలిపింది.
సరగోసి ఆలోచనే లేదు గౌరీకి.. కొత్త ఉద్యోగం కోసం ఎన్నో కంపెనీలకు రెజ్యూమె పంపింది. కానీ దొరికినవన్నీ ఫ్రంట్ ఆఫీస్ జాబ్ లే. జీతం కూడా రూ.15వేలే. గతంలో చిల్డ్రన్ ప్లేజోన్ నిర్వాహకురలిగా రూ. 45వేల దాకా సంపాదించాను. నాకో పసికందు. బ్యాంకులోన్లు మా ఆయనకు కూడా గత నాలుగు నెలలుగా జీతంలో 25 శాతమే వస్తోంది. నా బంధువు సూచించడంతో సరగేట్ గా మారడానికి సిద్ధపడ్డాను. చుట్టుపక్కల వాళ్లు, బంధువులు ఏమనుకుంటారో అని ఆలోచించను. ఎందుకంటే వారెవరూ ఇప్పటి నా కష్టాన్ని తీర్చే వారు కాదు.. అంటూ 36 ఏళ్ల గౌరీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది.
మల్టీప్లెక్స్ మేనేజర్ గా కొలువు చేసిన హీనాది ఇదే దుస్థితి. ఉన్న కొలువు ఊడింది. ఇప్పటి దాకా నెలకు రూ.50వేలు జీతం వచ్చేది. ప్రస్తుతం బిల్లుల ఎలా కట్టాలా.. లోన్లు ఎలా తీర్చుకోవాలా అని తెలీక సతమతమవుతోంది. ఈ సమయంలోనే తన స్నేహితురాలు ఎగ్ డోనేట్ చేయాల్సిందిగా సలహా ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితిలో డబ్బు అత్యవసరం. గత్యంతరం లేక ఎగ్ డోనార్ గా మారాల్సి వచ్చింది. మరో జాబ్ వస్తే బావుణ్ణు అంటోంది హీనా.
డాక్టర్లు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. గతంలో ఎగ్ డోనేట్ చేయడానికి, సరగేట్ గా మారడానికి పేదకుటుంబం మహిళలు వచ్చేవారు. కానీ ప్రస్తుత ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో చదువుకున్న యువతుల నుంచి మాకు కాల్స్ వస్తున్నాయన్నారు. సమాజంలో సరగోసి విషయంగా సానుకూల వాతావరణం ఏర్పడినట్లు అనిపిస్తోంది అని వ్యాఖ్యానించారు.
చూశారా కరోనాతో సమాజం ఎంతగా చితికిపోతోందో. ఉద్యోగాలు కోల్పోతున్న వారి కన్నీళ్లకు విలువే లేకుండా పోతోంది. ఉద్యోగంతో మాకూ ఆర్థిక స్వేచ్ఛ లభించింది అని ఉప్పొంగిన యువతులు ఇప్పడా ఉద్యోగాలే లేక అల్లాడిపోతున్న పరిస్థితి. మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్థకం...అమ్మా అనిపించుకొనుట స్త్రీమూర్తికి గౌరవం...ఇది పాటగా వినడానికి మాత్రమే హాయిగా ఉంటుంది. అయితే ఆ మాతృత్వాన్ని అమ్మకవస్తువుగా మార్చిన ఘనత మాత్రం కరోనాదే!