తెలంగాణలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా

By సుభాష్  Published on  21 July 2020 4:15 AM GMT
తెలంగాణలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. రోజురోజుకు పాజిటివ్ పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధులు వరకు ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టడం లేదు. రాష్ట్రంలో ఇప్పటికే హోంమంత్రి సహా పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడి కోలుకోగా, తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద్‌, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌లకు పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వివేకానంద్‌ మూడు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఆదివారం మేడ్చల్‌ జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్‌ ఆనంద్‌ సంప్రదించగా, ఆయన సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే నివాసానికి వచ్చి పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌ తేలింది. ఆయన కుటుంబ సభ్యులతో పాటు డ్రైవర్‌, గన్‌మెన్‌లు, ఇంట్లో పని మనుషులతో కలిసి 12 మందికి కరోనా పరీక్షలు చేయగా, భార్య, కుమారుడు, వంట మనిషికి కరోనా పాజిటివ్‌ తేలింది. కాగా, కుమార్తెకు మాత్రం నెగిటివ్‌ వచ్చింది. ఇక కార్యాలయంలో పని చేసే మరో పది మందికి కూడా సోమవారం పరీక్షలు నిర్వహించగా, అందరికి నెటిగివ్‌ ఉన్నట్లు తేలింది. ఎమ్మెల్యే, ఆయన భార్య, కుమారుడు హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.

అలాగే సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వోడితల సతీష్‌ కుమార్‌కు నాలుగు రోజుల క్రితం హన్మకొండలో స్వచ్చంధంగా హక్షం క్వారంటైన్‌కు వెళ్లారు. ఆదివారం కరోనా పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌ తేలింది. ఇక వైద్యుల సలహా మేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌ తెలిపారు.

కాగా, తెలంగాణ రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. ఇతర జిల్లాల కంటే అధికంగా హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదవుతున్నాయి. తాజాగా నిన్న ఒక్క రోజే 11,003 శాంపిళ్లను పరీక్షించగా, అందులో 1198 మందికి పాజిటివ్‌ వచ్చింది. అలాగే ఏడుగురు మృతి చెందగా, ఇప్పటి వరకు మృతుల సంఖ్య 422కు చేరుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 46,274 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇక తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 510 కేసులు కాగా, రంగారెడ్డి జిల్లాలో 106, మేడ్చల్‌ 76 కేసులు, సంగారెడ్డిజిల్లాలో 10 కేసులు, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 73, కరీంనగర్‌ జిల్లాలో 87, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 50, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో 11 కేసులు, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలో 26 కేసులు, న‌ల్గొండ‌ జిల్లాలో 24 కేసులు, అదిలాబాద్ జిల్లాలో 11 కేసులు, నాగ‌ర్ క‌ర్నూల్‌ జిల్లాలో 27 కేసులు, జ‌న‌గాం జిల్లాలో 12 కేసులు, నిజామాబాద్ జిల్లాలో 31 కేసులు, సూర్యాపేట జిల్లాలో 12 కేసులు చొప్పున‌ నమోదయ్యాయి. గ‌త 40‌ రోజులుగా తెలంగాణ‌లో అత్య‌ధికంగా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు తీవ్ర క‌ల‌వ‌రం చెందుతున్నారు.

Next Story